నల్లగొండ: రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా అన్ని రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్లు వేయించకపోతే నా పేరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే కాదని ఛాలెంజ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఇవాళ (అక్టోబర్ 7) మాల్, దేవరకొండ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణీ స్వీకారోత్స కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించే పదవే మార్కెట్ కమిటీ పోస్ట్ అని అన్నారు. 2014 ఎన్నికల్లో బాలు నాయక్‌ను ఒడగొట్టడానికి.. కుర్చీ వేసుకుని కూర్చొని మరీ ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత దిక్కు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్న అల్లుడు (హరీష్ రావు) లేడు కొడుకు (కేటీఆర్) లేడని.. ఎటుపోయారో కూడా తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల కోసం మళ్లీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు ప్రారంభించామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దుర్మార్గుడు కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పెండింగ్‌లో పెడితే.. దేవుడు కేసీఆర్‌ని ఫాం హౌస్‌లో పడుకొబెట్టాడని సెటైర్ వేశారు. ఎస్ఎల్బీసీకి బదులు పనికి మాలిన కాలేశ్వరానికి డబ్బులు వృధా చేశారని మండిపడ్డారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా అని చెప్పి ప్రజాధనం వేస్ట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్ రావు నల్గొండకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం.. హరీష్ రావు సిగ్గు లేకుండా ఇంకా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేవరకొండ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉండమని.. కచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
ALSO READ | వ్యక్తిగత అజెండా లేదు.. లేక్స్‌ను కాపాడటమే లక్ష్యం: డిప్యూటీ CM భట్టి
మూసీ ప్రక్షాళన చేయొద్దంటున్న హరీష్ రావు, కేటీఆర్ ఫ్యామిలీతో సహ వస్తే.. పోయి మూసీ పక్కనే నెల రోజులు ఉందామని.. అప్పుడు తెలుస్తోంది మీకు మూసీ నిర్వాసితుల బాధ అని అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసలు ఎక్కడ ఉండో తెలియదు.. కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడని విమర్శించారు. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచు కోట అని.. వచ్చే ఎన్నికల్లోనూ ఎవరిని ఇక్కడ కాలు పెట్టనివ్వమన్నారు.