మిస్ ఇండియా పోటీకి రిజర్వేషన్లా : కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఎద్దేవా

న్యూఢిల్లీ:  మిస్ ఇండియా పోటీకి ఎంపికైనవారి జాబితాలో దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళల్లో ఒక్కరికీ చోటు దక్కలేదన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కామెంట్లపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఫైర్ అయ్యారు. రాహుల్ ది చిన్నపిల్లల బుద్ధి అని ఎద్దేవా చేశారు. శనివారం యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మిస్ ఇండియా అందాల పోటీకి ఎంపికైన మహిళల జాబితాను చూశానని, వారిలో ఒక్కరు కూడా దళిత, గిరిజన, ఓబీసీ వర్గం వారు లేరన్నారు. 

అలాగే బాలీవుడ్ లేదా క్రికెట్ లో కూడా చెప్పులు కుట్టేవారు లేదా ప్లంబర్ వంటి వాళ్లకు చోటు ఉండట్లేదని చెప్పారు. చివరకు మీడియాలోని టాప్ యాంకర్లలో కూడా దేశంలోని 90 శాతం మంది నుంచి ఎవరికీ స్థానం లేదన్నారు. ఇలా 90 శాతం మంది ప్రాతినిధ్యం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదన్నారు. దీనిపై కిరెన్ రిజుజు ఆదివారం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి ముర్ము ఒక ఆదివాసీ మహిళ అని, ప్రధాని మోదీ ఓబీసీ అని, కేంద్ర కేబినెట్ లో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు.