లింగంపేట, వెలుగు: రాష్ట్రంలోని ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తేవడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన లింగంపేటలోని నాగన్నమెట్లబావిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఏళ్ల చరిత్రగల నాగన్న మెట్లబావి కట్టడం అద్భుతమన్నారు. మెట్లబావిని పునరుద్ధరించిన ఎమ్మెల్యే, కలెక్టర్,రైన్వాటర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. నాగన్నబావిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాగన్నబావి ఆవరణలో కనీస వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం నాగిరెడ్డిపేట మండలంలోని శ్రీత్రిలింగరామేశ్వరాలయాన్ని, పోచారం ప్రాజెక్టును సందర్శించారు.
పర్యాటక కేంద్రంగా 'కౌలాస్ కోట'
పిట్లం, వెలుగు: జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం శిథిలావస్థకు చేరిన కామారెడ్డి జిల్లా కౌలాస కోటను జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ఆశిస్సంగ్వాన్తో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాలు, నిర్మాణాలు, కళాఖండాలను కాపాడుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. శిథిలావస్థకు చేరిన కోటకు రిపేర్లు చేయించి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామన్నారు.
కోట ప్రాముఖ్యతను, కౌలాస్ కోట వంశీయుల గురించి ఎమ్మెల్యే వివరించారు. 12వ శతాబ్ధంలో కాకాతీయులు నిర్మించిన కౌలాస్ కోట నిర్వహణ కరువై శిథిలావస్థకు చేరిందన్నారు. కోటకు పూర్వవైభవం తీసుకుకు రావాలని కోరారు. కోటకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మించాలని మంత్రిని కోరగా మంత్రి స్పందించారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. తొలుత నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అనంతరం మద్నూర్ మండలంలో పర్యటించారు.
లింగంపేట, వెలుగు: పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్మోహన్రావు తో కలిసి పోచారం ప్రాజెక్టును సందర్శించి బోటు షికారు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు ఎగువన ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడంతో పర్యాటకులను ఆకర్షిస్తుందని అన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో టూరిజం పాలసీని ప్రవేశ పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.