సాగర్​ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం: మంత్రి జూపల్లి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.  శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్ట్ ను పరిశీలించారు.  

సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  అందుబాటులో ఉన్న  ప్రభుత్వ భూములను వెంటనే సర్వే చేసి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే  క్యాంపు ఆఫీసులో మాజీ సీఎల్పీ లీడర్​జానారెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సాగర్ ను ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దృష్టి పెట్టామన్నారు. బుద్ధవనం చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు వస్తుంటారని పేర్కొన్నారు. అందుకు అభివృద్ధి చేసేందుకు  ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్ నర్ షిప్ తో స్టార్ హోటల్, సాగర్ రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ ను  డెవలప్ చేస్తామని చెప్పారు. 

అన్నివర్గాలకు అందుబాటులో  ఉండే విధంగా కాటేజీలను కూడా నిర్మిస్తామన్నారు. సాగర్ లో వంద శా టూరిజాన్ని అభివృద్ధి  చేస్తామన్నారు. ముందుగా 270 ఎకరాల విస్తీర్ణంలోని బుద్ధవనం ప్రాజెక్ట్ విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ. ప్రకాశ్ రెడ్డి , కన్సల్టెంట్ శివనాగిరెడ్డి మంత్రికి వివరించారు. 

సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కమలేశ్ డి.పాటిల్(దాజి ), స్థానిక అధికారులు ఉన్నారు.