హాలియా, వెలుగు : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం, బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుపై పాట్నాలో జరుగుతున్న ట్రావెల్ ట్రేడ్ ఫేర్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రారంభించారని తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మంగళవారం మీడియాకు తెలిపారు..
బుద్ధవనానికి ప్రాధాన్యతనిస్తూ రామప్ప దేవాలయం, గోల్కొండ కోటల ఛాయా చిత్రాలను స్టాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో అద్భుత పర్యాటక స్థావరాలు ఉన్నాయని, ప్రపంచస్థాయి పర్యాటక స్థావరంగా తెలంగాణను అభివృద్ధి చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని షెకావత్ హామీ ఇచ్చారని తెలిపారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రముఖ పర్యాటక స్థావరాలను సందర్శించాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.