గత పాలకుల సహకారం లేకనే .. తెలంగాణ డెవలప్ కాలే : బండి సంజయ్​

  • వేములవాడ కృతజ్ఞత సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్

వేములవాడ, వెలుగు: తెలంగాణను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీకి ఉన్నా గత పాలకులు సహకరించలేదని, వేములవాడ రాజన్న ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో వేములవాడ నియోజకవర్గ కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. అంతకుముందు చందుర్తి మండలంలో ఎంపీ ల్యాడ్స్​ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.

పట్టణంలో కల్యాణ మండపానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ మాట్లాడుతూ వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్  ప్రభుత్వం సహకరించలేదన్నారు. ఆలయాన్ని డెవలప్​ చేసేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసినట్లు చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకార్  సహకారంతో కొండగట్టు, రాజన్న ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొన్ని పార్టీలకు బాంబు పేలుళ్లు, నక్సలైట్ల హత్యల్లేవని బోర్  కొడుతోందని ఎద్దేవా చేశారు. అవేమీ లేకుండా చేసిన వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు.

అహంకారం చూపించను..

కార్యకర్త స్థాయి నుంచి తాను ఎదిగానని ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. సాయం చేయడం బాధ్యతగా భావిస్తానే తప్ప ఎన్నడూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించనని చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, కుల సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్​ రావు పాల్గొన్నారు. చందుర్తిలో కేంద్ర మంత్రిని కలెక్టర్  సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.