మాజీ సర్పంచుల అప్పులకు బీఆర్ఎస్సే కారణం : మంత్రి బండి సంజయ్

  • హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉన్నది: సంజయ్​
  • రాహుల్ కు 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా?
  • రుణమాఫీ, గ్యారంటీలపై మహారాష్ట్రలో యాడ్స్ సిగ్గుచేటని కామెంట్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మాజీ సర్పంచుల అప్పులకు గత బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​వాళ్లను ఆందోళనకు ఎందుకు పిలిచారని మాజీ సర్పంచ్​లను  ప్రశ్నించారు. మాజీ సర్పంచ్​లకు మద్దతుగా బీఆర్ఎస్​ఆందోళన చేయడం కత్తితో పొడిచి హత్యచేసినవాళ్లే సంతాప సభ తెలిపినట్టుగా ఉన్నదని విమర్శించారు. బీఆర్ఎస్​ మోసపూరిత విధానాలను నమ్మి మోసపోవద్దని మాజీ సర్పంచులకు సూచించారు.

 రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలపై  సమాధానం చెప్పే దమ్ముందా? అని  ప్రశ్నించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా  రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో పర్యటించి.. ఎంపీ ల్యాడ్స్, ఉపాధి హామీ ఫండ్స్​తో చేపడుతున్న పనులకు సంజయ్​శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా యాత్ర చేసినట్టు చెప్పుకుంటున్న రాహుల్.. 6 గ్యారంటీల అమలులో ఎందుకు విఫలమయ్యారో చెప్పి తెలంగాణలో పాదయాత్ర చేయాలని  సవాల్ విసిరారు.

 తెలంగాణలో రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పేరుతో మహారాష్ట్రలోని పేపర్లలో యాడ్స్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటించారని,  యాడ్స్​లో మాత్రం  రుణమాఫీ పూర్తిచేశామని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.  ‘‘సీఎం రేవంత్​రెడ్డి మూసీనదిపై పాదయాత్ర చేస్తా అంటుండు. నేను గతంలో మూసీపై పాదయాత్ర చేసిన. విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూసిన. యాదాద్రి జిల్లా ప్రజలు సాగు, తాగు నీటి కోసం ఏ విధంగా బాధలు పడుతున్నరో చూసిన. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుంచీ కోరుతున్నది. కానీ, ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దన్నదే మా డిమాండ్.

 రూ. 15 వేల కోట్లతో మూసీ పునరుజ్జీవం చేయొచ్చు. కానీ, కాంగ్రెస్ లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మేం వ్యతిరేకం’’ అని అన్నారు.  బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని కాంగ్రెస్ మంత్రులే మొత్తుకుంటున్నారని,   జీతాలకే ఇబ్బందిగా ఉందంటున్నప్పుడు లక్షన్నర  కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంటే.. మీరు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా?’’ అని సంజయ్​మండిపడ్డారు.

ఆలయాలపై దాడులు చేస్తే చర్యలు తీసుకోరా?

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను సంజయ్ ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నించారు. ‘‘ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడి వేరే మతం మీద జరిగితే దుబాయ్, సౌదీ, పాకిస్తాన్  నుంచి స్టేట్ మెంట్లు, వారెంట్లు వస్తుండే’’ అని అన్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఎందుకు చర్యలుండవో సీఎం సమాధానం చెప్పాలని సంజయ్ ​డిమాండ్ చేశారు.