పరిశుభ్రతలో కరీంనగర్ కార్మికుల కృషి  భేష్ : బండి సంజయ్ 

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం బల్దియా ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్ పేయితో కలిసి కేంద్రమంత్రి చీపురుపట్టి చెత్త ఊడ్చారు.

అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనసులో పేరుకుపోయిన మురికి కంపును తొలగించండి–మానవ సేవ మాధవ సేవ అనే గాంధీ మాటలను ఆచరించండి’ అని పిలుపునిచ్చారు. సఫాయి కార్మికుల కృషి వల్లే శానిటేషన్ విషయంలో కరీంనగర్ కు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు వచ్చిందన్నారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు. 

భవానీ దీక్ష స్వీకరించిన బండి సంజయ్ 

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం   ఉదయం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు దీక్ష చేపట్టారు. విజయదశమి వరకు మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపనున్నారు.