అక్రమంగా గ్రానైట్ రవాణా

  • మిడ్ వెస్ట్ కంపెనీలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
  • లారీలకు పర్మిషన్ లేదని మొక్కుబడిగా ఫైన్ 
  • కోట్ల విలువైన మైనింగ్ పక్కదారి
  •  పట్టించుకోని అధికారులు

సూర్యాపేట/కోదాడ, వెలుగు : మైనింగ్ శాఖ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. కోట్ల విలువైన గ్రానైట్​ను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ యాజమాన్యానికి కేవలం ట్రాన్స్​పోర్టు పర్మిషన్ లేదంటూ వేలల్లో జరిమానా విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలోని మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ ఉంది.

 ఈ కంపెనీ యాజమాన్యం పరిమితికి మించి గ్రానైట్ ను మైనింగ్ చేయడం, దానిని అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ తర్వాత వచ్చే వ్యర్థాలను యథేచ్ఛగా పాలేరు వాగులో కలుపుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇంత జరుగుతున్నా మైనింగ్, కాలుష్య నియంత్రణ, రెవెన్యూ అధికారులు, పోలీసులు సదరు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయా శాఖల అధికారులకు నెలవారీగా మామూళ్లు ముట్టజెప్పడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

కోట్ల విలువైన మైనింగ్ పక్కదారి..

అనుమతులకు మించి కోట్ల విలువైన మైనింగ్ తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల స్టేట్ మైనింగ్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. విలువైన గ్రానైట్ ను 13 వాహనాల్లో తరలిస్తుండగా పోలీసుల సహాయంతో మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. లారీలకు ట్రాన్స్​పోర్టు పర్మిషన్ లేదంటూ నామమాత్రపు జరిమానా విధించి విడిచి పెట్టారు. 13 లారీల్లో కోట్ల విలువైన గ్రానైట్ పట్టుబడగా, కేవలం 7 వాహనాలకు మాత్రమే ఫెనాల్టీ చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రహదారిని ఆక్రమించి యథేచ్ఛగా మైనింగ్..

చిమిత్యాల గ్రామ శివారులో మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ ఉంది. రోడ్డుకు ఒకవైపున మైనింగ్ కంపెనీ ఉండేది. ఆ తరువాత రోడ్డుకు రెండో వైపు కూడా గ్రానైట్ నిల్వలు ఉన్నాయని తెలిసింది. దీంతో అక్కడ ఉన్న తోటలను కొనుగోలు చేసి రెండు సంవత్సరాల క్రితం మైనింగ్ కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. 

అనంతరం మైనింగ్ విస్తరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రోడ్డుకు ఇరువైపులా తమ స్థలమే ఉందని కొత్తగూడెం, గోండ్రియాలకు వెళ్లే రహదారిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. దీంతో అటువైపు నుంచి ఎవరూ వెళ్లాలన్నా సెక్యూరిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. అక్రమాలకు పాల్పడుతున్న మిడ్ వెస్ట్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చిమిర్యాల, గొండ్రియాల, కొత్తగూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.