తడిసిన వడ్లను దింపుకోమంటున్న మిల్లర్లు

  • సూర్యాపేట జిల్లాల్లో మిల్లుల ఎదుట బారులుతీరిన లారీలు 

నల్గొండ, వెలుగు: సూర్యాపేట జిల్లాలో వడ్ల లోడింగ్ నిలిచిపోయింది. మిల్లులకు తరలుతున్న వడ్లు  మొలకెత్తడంతో దింపుకునేది లేదని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. తేమ శాతం, గ్రేడింగ్  చేయకుండా మిల్లులకు వడ్లు పంపిస్తున్నారని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వడ్లను దించుకునేందుకు మిల్లర్లు నిరాకరించడంతో రైస్  మిల్లుల ఎదుట లారీలు బారులుదీరాయి. వర్షాలకు వడ్లు రంగు మారడంతో మిల్లింగ్  చేసే సమయంలో ఇబ్బంది వస్తుందని, ఈ వడ్లను బియ్యంగా మారిస్తే ఎఫ్ సీఐ కొర్రీలు పెడుతుందని అంటున్నారు.

తమకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం నుంచి హామీ ఇస్తేనే వడ్లను దింపుకుంటామంటూ జిల్లాలోని మిల్లర్లు వడ్లను దిగుమతి చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మిల్లర్లతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,532 మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, 1,280 మెట్రిక్​ టన్నుల వడ్లు మిల్లులకు చేరాయి. మిగిలిన 3, 250 మెట్రిక్​ టన్నుల వడ్లు ఇంకా మిల్లులకు పంపించాల్సి ఉంది. 

రంగు మారుతున్న ఐకేపీ సెంటర్లలో వడ్లు..

ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. వడ్లు తడిసి తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రైతులు కల్లాల్లోనే వడ్లను అరబెట్టి అమ్ముకున్నారు. ఈ వడ్లను లిఫ్ట్  చేయడంలో ఆలస్యం చేయడంతో రంగు మారుతున్నాయి. సెంటర్లలో ఏఈవోలు వడ్లను పరిశీలించి సర్టిఫై చేశాక కొనుగోలు చేయాలి. తేమ శాతం, గ్రేడింగ్  చేయకుండా మిల్లులకు వడ్లను పంపించడంతో మిల్లర్లు వాటిని దించుకునేందుకు నిరాకరిస్తున్నారు.

రంగు మారిన వడ్లను మిల్లింగ్  చేస్తే ఎఫ్​సీఐ సూచించన  ప్రమాణాల ప్రకారం బియ్యం వచ్చే అవకాశాలు లేవని మిల్లర్లు చెబుతున్నారు. నూక శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఎఫ్ సీఐ రిజెక్ట్  చేస్తే.. ఆ బియ్యం తామే ట్రాన్స్​పోర్ట్  ఖర్చులు పెట్టుకొని తెచ్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు నష్టం రాకుండా చూడాలని కోరుతున్నారు