పాలు సంపూర్ణ పౌష్టికాహారం.. అందుకే జ్యోతి పద్మ తన కూతురికి రోజూ పాలు తాగించేది. కానీ.. జీర్ణం అయ్యేవి కాదు. బిడ్డ పాలు తాగిన ప్రతిసారి ఇబ్బంది పడేది. అప్పుడే జ్యోతి తన బిడ్డకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందని తెలుసుకుంది. తన కూతుర్ని ఆ సమస్య నుంచి బయటపడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరకు శ్రేష్టమైన పాలు తాగితే బిడ్డ సమస్య తగ్గిపోతుందని గ్రహించింది.
అలాంటి పాల కోసం ఆ తల్లి చేసిన అన్వేషణ నుంచి పుట్టిందే బీకేడీ డెయిరీ ఫామ్. జ్యోతి పద్మ తన కూతురికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందని తెలిసినప్పుడు చాలా బాధపడింది. వాళ్ల కుటుంబంలో ఎవరికీ ఆ సమస్య లేదు. అయినా.. తన కూతురికి ఎలాగైనా పాలు తాగించి, అన్ని పోషకాలను అందించాలని నిర్ణయించుకుంది.
రకరకాల పాల బ్రాండ్‌లు, స్థానికంగా రైతుల దగ్గర దొరికే పాలను బిడ్డకు పట్టించింది. ఏదైనా ఇమిడితే కంటిన్యూ చేయాలి అనుకుంది. కానీ.. అవేవీ బిడ్డకు పడలేదు. తన కూతురికి ఎందుకు వచ్చింది? అసలు అది ఎందుకు వస్తుంది? దాని నుంచి ఎలా బయటపడాలి?.. ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి జ్యోతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆవులకు సరైన ఫీడ్ ఇవ్వకపోవడం, వాటిని శుభ్రమైన వాతావరణంలో ఉంచకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలుసుకుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం.. ఏ2 పాలు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్లు కూడా తాగొచ్చని తేలింది. అందుకే లక్నోలో ఉంటున్న తన అక్క దగ్గర్నించి స్వచ్ఛమైన ఏ2 పాలను తీసుకొచ్చి, కూతురికి తాగించింది. అవి ఈజీగా జీర్ణమయ్యాయి. దాంతో తన కూతురితోపాటు ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్ల కోసం తానే ఆవులను పెంచాలి అనుకుంది. దానివల్ల ఎంతోమంది బిడ్డలకు మేలు చేయొచ్చని ఆ నిర్ణయానికి వచ్చింది. జ్యోతి టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆమెకు అప్పటివరకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు. అయినా ప్రతీది నేర్చుకుంది.
జెర్సీ ఆవులతో..
వాస్తవానికి జ్యోతిది ఉత్తరప్రదేశ్. కానీ... కొన్ని కారణాల వల్ల మధ్యప్రదేశ్‌లోని థానేకి మకాం మార్చింది. అప్పుడే జ్యోతికి పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఏ2 ఆవు పాలు దొరకడం కష్టమని తెలిసింది. ‘‘నేను ఉత్తరప్రదేశ్‌లో పెరిగాను. అక్కడ ఉన్నప్పుడు పాల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. కానీ.. థానేకి వచ్చాక ముఖ్యంగా నాకు కూతురు పుట్టాక స్వచ్ఛమైన పాల విలువ తెలిసింది. అందుకే 2019లో మహారాష్ట్ర శివార్లలో ముంబై–పుణె హైవేకి దగ్గర్లో రెండు ఎకరాల భూమిని లీజుకి తీసుకుని ‘‘శ్రీ బాలకృష్ణ డెయిరీ ఫామ్” (బీకేడీ మిల్క్) పెట్టా. జెర్సీ, సాహివాల్‌తో సహా రకరకాల బ్రీడ్స్ ఆవులు అందులో ఉన్నాయి. నా భర్త సాయంతో 5జీ నేపియర్, గోధుమ గడ్డి, మిల్లెట్ లాంటివాటిని సేంద్రియ పద్ధతిలో పండించి ఆవులకు మేతగా వేశాం.
ఆవులు స్వేచ్ఛగా తిరగడానికి కావాల్సిన వాతావారణం ఏర్పాటు చేశాం. అంతేకాదు.. పాలను కచ్చితంగా చేతితోనే పితకాలి. ఎలాంటి మిషన్లు వాడకూడదని నిర్ణయించుకున్నా. పైగా పితికిన తర్వాత కొన్ని గంటల్లోనే కస్టమర్ల ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేశా. దానివల్ల చాలా తక్కువ టైంలోనే బీకేడీ మిల్క్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిరోజూ 200 మందికి పైగా వినియోగదారులకు పాలు అమ్ముతున్నా. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా టర్నోవర్ అవుతోంది” అంటూ తన జర్నీ చెప్పుకొచ్చింది.
ఆవు కరెన్సీ!
బీకేడీ మిల్క్ సక్సెస్ కావడంతో జ్యోతి వ్యవసాయాన్ని ఒక వ్యవస్థీకృత రంగంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పరీక్షిత్ సంపత్ సాయితో కలిసి ‘కౌ కరెన్సీ’ అనే వెంచర్‌ని మొదలుపెట్టింది. పట్టణాల్లో ఉంటూ స్వచ్ఛమైన పాల కోసం ఆరాటపడే కుటుంబాల కోసం దీన్ని తీసుకొచ్చారు. “జ్యోతి భర్త నాకు ఫ్రెండ్. అతనే జ్యోతి డెయిరీ ఫామ్ పెట్టిందని చెప్పాడు. అప్పుడే ఆమె ‘కౌ కరెన్సీ’ ఐడియా చెప్పా. జ్యోతి కూడా ఆసక్తి చూపించింది. వెంటనే కాన్సెప్ట్‌ని అమలు చేశాం. ఇందులో కస్టమర్లు 1,08,000 రూపాయలు ప్రారంభ పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మా దగ్గర ఉన్న ఆవుల్లో ఒకటి మూడు సంవత్సరాల పాటు వాళ్ల సొంతం అవుతుంది. కానీ.. అది మా దగ్గరే ఉంటుంది. ఆవు ఆరోగ్య సంరక్షణ, దాణా అన్నీ మేమే చూసుకుంటాం.
కస్టమర్‌కు మాత్రం ప్రతిరోజూ రెండు లీటర్ల తాజా ఏ2 పాలు, ప్రతి నెలా రెండు కిలోల నెయ్యి పంపిస్తాం. కస్టమర్ వేరే రాష్ట్రంలో ఉన్నా నెయ్యి కొరియర్ చేస్తాం. పాలకు బదులు వాళ్ల ఖాతాలో డబ్బులు వేస్తాం. సహజంగా ప్రతి ఆవుకు సంవత్సరంలో నాలుగు నెలల పొడి కాలం ఉంటుంది. అంటే.. ఆ టైంలో పాలు ఇవ్వదు. కానీ.. కౌ కరెన్సీ కస్టమర్లకు ఆ నాలుగు నెలలు కూడా పాలు సప్లై చేస్తాం. ఈ లెక్కన లీటరు పాలు కేవలం 45 రూపాయలకే అందిస్తున్నాం” అని పరీక్షిత్ వివరించాడు. మూడు సంవత్సరాల తర్వాత కస్టమర్లకు తిరిగి 22,000 రూపాయలు కూడా ఇస్తారు.
కస్టమర్లకు ఆవు, దాని జెనెటిక్ పేరెంట్స్ వివరాలు, బ్రీడ్ సర్టిఫికేట్ లాంటివన్నీ ఇస్తారు. అంతేకాదు.. కస్టమర్ తన పెంపుడు ఆవుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి చూడొచ్చు. ఈ కౌ కరెన్సీలో 70 మందికిపైగా కస్టమర్లు చేరారు. ఇప్పుడు జ్యోతి, పరీక్షిత్ కలిసి దేశం అంతటా ఇలాంటి ఫామ్స్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. 75 ఫామ్‌లను ఏర్పాటు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారు.
స్వచ్ఛమైన పాలు తాగుతున్నా
‘‘కౌ కరెన్సీ మోడల్ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. నా చిన్నప్పుడు మాకు ఆవులు ఉండేవి. నేను వాటితో కలిసి ఆడుకునేదాన్ని. కానీ.. సిటీకి వచ్చిన తర్వాత ఆవులు కనిపించడంలేదు. స్వచ్ఛమైన పాలు దొరకడంలేదు. అందుకే కౌ కరెన్సీలో చేరా. ఇక్కడ నాకంటూ ఒక ఆవు ఉంది. దాని నుంచి వచ్చే స్వచ్ఛమైన పాలు రోజూ తాగుతున్నా. నా ఆవుకు ముద్దుగా రివాన్ అని పేరు పెట్టుకున్నా. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్లి దాంతో ఆడుకుంటున్నాం. నా సొంత ఆవు పాలు తాగడం ఎంతో సంతృప్తిని ఇస్తోంది” అంటోంది కౌ కరెన్సీ కస్టమర్ పుష్పాంజలి దత్తా.