ఆగంజేసిన మైక్రోసాఫ్ట్​

  •  విండోస్​లో సాంకేతిక సమస్య.. క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు
  • బ్లూ కలర్​లోకి మారిపోయిన డెస్క్ టాప్, ల్యాప్ టాప్ స్క్రీన్​లు 
  • ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇబ్బందులు 
  • ఆగిన విమానాలు, బ్యాంకింగ్ సేవలు, టీవీ చానెళ్ల ప్రసారాలు
  • సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలపైనా భారీగా ఎఫెక్ట్ 
  • శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో 35 విమానాలు రద్దు
  • మైక్రోసాఫ్ట్​లో కొత్తగా తెచ్చిన అప్డేట్​తోనే మొదలైన సమస్య 
  • సమస్యను పరిష్కరిస్తున్నామన్న యాజమాన్యం.. యూజర్లకు క్షమాపణలు

న్యూఢిల్లీ/లండన్/సిడ్నీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లక్షలాది విండోస్ కంప్యూటర్ స్క్రీన్ లు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా బ్లూ కలర్ లోకి మారిపోయాయి. విండోస్ సిస్టమ్ లో ఎర్రర్ ఏర్పడిందని, షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చేయాల్సి ఉందంటూ మెసేజ్ లు దర్శనమిచ్చాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా సిస్టమ్స్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతూ మళ్లీ మళ్లీ క్రాష్ అయిపోయాయి. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు ఐటీ సర్వీసులు నిలిచిపోయాయి. 

ఎయిర్ లైన్స్ నుంచి మొదలుకొని బ్యాంకింగ్, సూపర్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, హాస్పిటల్స్, టీవీ చానెళ్ల ప్రసారాలు, తదితర వాటిపై తీవ్ర ప్రభావం పడింది. అనేక దేశాల్లో ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆన్ లైన్ సేవల్లో ఆటంకం ఏర్పడటంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. తమ క్లౌడ్ స్టోరేజ్ సర్వర్లలో టెక్నికల్ సమస్య కారణంగానే ఇబ్బందులు తలెత్తాయని, సమస్యను గుర్తించి, పరిష్కరిస్తున్నామని సమస్య మొదలైన 6 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి తమ సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెచ్చామని.. కానీ చాలా మంది యూజర్లకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చని, సేవల్లో అంతరాయానికి క్షమించాలని కోరింది. 

బ్లూ కలర్​లోకి మారిన కంప్యూటర్ స్క్రీన్​లు..  

విండోస్​తో పనిచేసే డెస్క్ టాప్​లు, ల్యాప్​టాప్​ల స్క్రీన్​లు అకస్మాత్తుగా బ్లూ కలర్​లోకి మారిపోవడాన్నే బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ (బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ -బీఎస్ఓడీ) అంటారు. దీనివల్ల కంప్యూటర్లు సడెన్​గా షట్ డౌన్ కావడం లేదా రీస్టార్ట్ కావడం జరుగుతుంది. ‘‘మీ సిస్టంలో సమస్య ఏర్పడింది. వెంటనే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ స్క్రీన్​పై అలర్ట్ కనిపిస్తుంది. ఆ వెంటనే సిస్టం షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. ఇలా తరచూ జరుగుతూ, ఇంటర్ నెట్ యాక్సెస్ పొందేందుకు వీల్లేకుండా పోతుంది. 

ప్రస్తుత సమస్యకు కారణం ఇదే.. 

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్స్​లో ఓ బగ్​ను నివారించేందుకు చేసిన ‘ఫాల్కన్ సెన్సర్’ అనే అప్డేట్ రివర్స్ కావడంతో లక్షలాది మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్(-బీఎస్ఓడీ) సమస్య ఎదురైందని ఆ కంపెనీకి సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న ‘క్రౌడ్ స్ట్రైక్’ సంస్థ వెల్లడించింది. ఇది కేవలం టెక్నికల్ సమస్యే తప్ప సైబర్ అటాక్ కాదని స్పష్టం చేసింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, మైక్రోసాఫ్ట్ టీమ్, మైక్రోసాఫ్ట్ అజూర్ (క్లౌడ్ కంప్యూటింగ్) సర్వీసులు పొందుతున్న ఎయిర్ లైన్స్, బ్యాంకులు, ఇతర సంస్థలు, కస్టమర్లందరికీ బీఎస్ఓడీ సమస్య ఎదురైనట్టు వెల్లడించింది.  

భారత్​లో ఎయిర్ లైన్స్ పై ఎఫెక్ట్.. 

మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కారణంగా భారత్ లో ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్స్ సేవలకు అంతరాయం కలిగింది. టికెట్ బుకింగ్, చెకిన్, ఫ్లైట్ అప్డేట్స్​పై ప్రభావం పడింది. సిబ్బంది మ్యానువల్​గా చెకిన్ నిర్వహిస్తూ బోర్డింగ్ పాస్​లపై చేతితో వివరాలను రాస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర సిటీల్లోని ఎయిర్ పోర్టుల్లో వందలాది విమానాలు రద్దవడం, మరికొన్ని  ఆలస్యం కావడంతో ప్యాసింజర్లు భారీగా క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో 90 శాతం విమానాలు రద్దయ్యాయి. ఒక్క ఇండిగో ఎయిర్ లైన్స్ నుంచే దాదాపు 300 విమానాలను క్యాన్సిల్ చేశారు. రీబుకింగ్, రిఫండ్ క్లెయిమ్ సర్వీసులు కూడా తాత్కాలికంగా అందుబాటులో లేవని ఆ కంపెనీ తెలిపింది.

ఆస్ట్రేలియాపై అత్యధిక ప్రభావం 

మైక్రోసాఫ్ట్ సమస్య వల్ల ఆస్ట్రేలియాపై అత్యధిక ప్రభావం పడింది. విండోస్ సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా ఏబీసీ న్యూస్ టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. బ్లూస్క్రీన్ ఎర్రర్ చూపిస్తున్న కంప్యూటర్ల ముందు నిలబడి న్యూస్ ప్రజెంటర్లు వార్తలను చదువుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాంకులు, టెలికం, మీడియా సంస్థలు, ఎయిర్ లైన్స్ సేవల్లోనూ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడ్డాయి. బ్రిటన్ లో స్కై న్యూస్ చానెల్ ప్రసారాలు ఆగిపోయాయి. అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కూడా వార్తలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. 

అమెరికాలోనూ డెల్టా, యునైటెడ్, అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థల సర్వీసులూ ఎఫెక్ట్ అయ్యాయి. ఎడిన్ బరో ఎయిర్ పోర్టు వద్ద బోర్డింగ్ పాస్ స్కానర్లు, మానిటర్లు పని చేయడం లేదంటూ బోర్డులు పెట్టారు. టర్కిష్ ఎయిర్ లైన్స్ కూడా ఇవే సమస్యలు ఎదురయ్యాయి. జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ ఇతర దేశాల్లోనూ వివిధ రంగాల్లో ఐటీ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. 

హెల్త్ సర్వీసులకూ అంతరాయం   

అమెరికాలోని అనేక ప్రాంతాల్లో 911 ఎమర్జెన్సీ సర్వీసులకు ఆటంకం కలిగింది. నాన్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు సైతం పనిచేయలేదు. బ్రిటన్ సహా అనేక దేశాల్లో హెల్త్ సర్వీసులపైనా ప్రభావం పడింది. ప్రపంచవవ్యాప్తంగా పలు స్టాక్ ఎక్స్చేంజీలు కూడా ప్రభావితమయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ తోపాటు అనేక బ్రోకరేజ్ కంపెనీల సేవలకూ అంతరాయం ఏర్పడింది. భారత్​లోనూ ట్రేడర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ కార్యకలాపాలపై కూడా ఐటీ ఆపరేషన్ల సమస్య ప్రభావం చూపింది.

 పది ఇండియన్ బ్యాంకుల సేవలకూ ఆటంకం..

బ్యాంకింగ్​పైనా బ్లూ స్క్రీన్ ఎర్రర్ ప్రభావం పడటంతో కొన్ని గంటలపాటు పలు బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయలేదు. అలాగే ఆయా బ్యాంకులతో ముడిపడి ఉన్న పేమెంట్ సిస్టమ్స్ కూడా స్తంభించిపోయాయి. దేశంలోని దాదాపు 10 బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల సేవలపై ఈ ప్రభావం పడినట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. మన దేశంలోని ఎన్ఐసీ నెట్ వర్క్ పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. సమస్యకు కారణాన్ని మైక్రోసాఫ్ట్ నిపుణులు గుర్తించారని, సమస్యను పరిష్కరించేందుకు అప్డేట్స్ కూడా రిలీజ్ చేశారని ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. 

శంషాబాద్​లో 35 విమానాలు రద్దు 

హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: మైక్రోసాఫ్ట్ విండోస్​లో సాంకేతిక సమస్యల వల్ల శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. శంషాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళవలసిన ఇండిగో, తదితర సంస్థలకు చెందిన 35 విమానాలను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, అకస్మాత్తుగా ఫ్లైట్లు రద్దు కావడం, రద్దు అయిన ఫ్లైట్ల వివరాలు సైతం ఎయిర్ పోర్టులోని డిస్ ప్లే బోర్డులపైన కనిపించకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ల బుకింగ్, చెక్ ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు సమాచారం ఇచ్చాయి.