- రెసిడెన్షియల్ ఏరియాల్లో 80 డిసిబుల్స్ వరకు నమోదు
- నిద్రలేని రాత్రులు గడుపుతున్న జనాలు
- కంప్లయింట్ చేసినా నో సొల్యూషన్
- వేరే సిటీల్లో సౌండ్ బారియర్స్‌తో సమస్యకు పరిష్కారం
హైదరాబాద్ సిటీ/ పద్మారావునగర్, వెలుగు : మెట్రో రైల్ ట్రాక్ సౌండ్స్‌తో సిటీ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెట్రో మార్గాల్లో మలుపులున్న చోట ట్రాక్ సౌండ్ ఎక్కువగా వస్తుండడంతో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉండే పిల్లలు, సీనియర్సిటిజన్స్సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు అయితే ఉలిక్కిపడి లేవాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం సిటీలో మూడు కారిడార్ల పరిధిలో మెట్రో రైళ్లు 69 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి.
రెసిడెన్షియల్ ప్రాంతాల నుంచి వెళ్లే టైంలో సాధారణం కంటే ఎక్కువ సౌండ్ పొల్యూషన్ నమోదవుతున్నది. సమీపంలోని భవనాలు కూడా వైబ్రేషన్‌కు గురవుతున్నాయి. దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల్లోని జనాలు వాపోతున్నారు.
సౌండ్ ‘డబుల్’
జీవో నంబర్172, సౌండ్ పొల్యూషన్ రూల్స్2010 ప్రకారం.. రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉదయం 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్‌కు మించకూడదు. కానీ, మెట్రో వెళ్తున్న టైంలో మలుపుల వద్ద 80 డెసిబుల్స్వరకూ నమోదవుతున్నది. పీసీబీ లెక్కల ప్రకారం బోయిగూడ జంక్షన్‌వద్ద ఉన్న మూల మలుపులో రాత్రి 80 డెసిబుల్స్ సౌండ్ రికార్డవుతున్నది. రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులతో
తర్వాత మెయింటనెన్స్ పేరిట అర్ధరాత్రి వేళల్లో రైళ్లను తిప్పుతుండడంతో జనాలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఒక్క బోయిగూడలో మాత్రమే కాకుండా మెట్రో మార్గంలో మలుపులున్న ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ వెనుక వైపున్న పద్మహంస అపార్ట్మెంట్వద్ద కూడా 70 నుంచి 80 డెసిబుల్స్నమోదవుతున్నది
రైలొస్తే 80 డెసిబుల్స్‌కు తగ్గట్టే
న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నంబర్ బీ1006 మలుపు వద్ద మెట్రో రైళ్ల వల్ల వస్తున్న సౌండ్స్‌తో వినికిడి సమస్యలతో పాటు గుండెల్లో దడ వస్తోందని ఎంఎన్ కే సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్లుగా మెట్రోతో పాటు పోలీస్, పీసీబీ, ప్రజాప్రతినిధులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. మెట్రో ఆఫీసర్లు నామమాత్రంగా గ్రీజింగ్చేసి చేతులు దులుపేసుకుంటున్నారని, పర్మినెంట్ సొల్యూషన్చూపించట్లేదంటున్నారు.
హైదరాబాద్ కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణిలో ఏప్రిల్12న ఫిర్యాదు చేయగా.. పీసీబీ, మెట్రో ఆఫీసర్లు, సిటీ పోలీస్ కమిషనర్ కలిసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పీసీబీ వెళ్లి న్యూ బోయిగూడ మెట్రో పిల్లర్ నంబర్బీ 1006 మలుపు వద్ద చెక్‌చేయగా 80 డెసిబెల్స్ వరకు శబ్ద కాలుష్యం నమోదవుతున్నట్లు నిర్ధారించింది.
ALSO READ : జనవరి విడుదల..వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ బయటకు
సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్13న మెట్రో రైలు ఎండీ, ఎల్అండ్ టీ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ నెల 17 న మళ్లీ ప్రజావాణిలో మరోసారి కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మలుపు వద్ద హారన్కొట్టేవారని, తాము మెట్రో రైళ్లకు అడ్డం వచ్చేవారు ఎవరు ఉంటారని, ఎందుకు హారన్కొడుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఆపేశారని సెంట్రల్‌కోర్టు అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు.
సౌండ్ బారియర్స్‌తో సొల్యూషన్..
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, నోయిడా తదితర సిటీల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఆ సిటీల్లో ఇక్కడి లెక్కనే మెట్రో సౌండ్స్ కు సంబంధించిన కంప్లయింట్స్రావడంతో చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో మార్గంలో సౌండ్ పొల్యూషన్ ను నివారించడానికి సోలార్ సౌండ్ బారియర్స్ ఏర్పాటు చేశారు. ఈ సోలార్ సౌండ్ బారియర్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడంతో పాటు.. మెట్రో నుంచి వెలువడే సౌండ్స్ స్థాయిని తగ్గిస్తాయి.
ముంబై, నోయిడా మెట్రోలకు సంబంధించి కూడా సౌండ్ పొల్యూషన్ పై కంప్లయింట్స్రావడంతో అక్కడ కూడా సౌండ్ బారియర్స్ ఏర్పాటు చేశారు. ఈ సౌండ్ బారియర్స్ దాదాపు 30 డెసిబుల్స్ సౌండ్‌ను కంట్రోల్ చేయగలుగుతాయి. హైదరాబాద్ మెట్రో వెళ్లే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఈ సౌండ్ బారియర్స్ ఏర్పాటు చేయాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బిల్డింగ్ వైబ్రేట్ అవుతోంది
మెట్రో రైల్ మార్గం మా అపార్ట్మెంట్ పక్క నుంచే వెళ్తుంది. ఉదయం మెట్రో సర్వీసులు మొదలైనప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు వచ్చే సౌండ్ భరించలేకపోతున్నాం. ఇదివరకు పది నిమిషాలకు ఒక రైల్ వెళ్లేది. ఇప్పుడు మూడు నిమిషాలకో రైల్ వెళ్తోంది. రైల్ వెళ్లే సమయంలో మా బిల్డింగ్ వైబ్రేషన్ కు గురవుతోంది. మెట్రో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
- జోసెఫైన్, పద్మహంస అపార్ట్మెంట్, రెజిమెంటల్ బజార్
కంప్లయింట్ ఇచ్చినా యాక్షన్ లేదు
మెట్రో పిల్లర్స్ కట్టేప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ, పబ్లిక్ యుటిలిటీ అని ఏమనలేదు. దాని తర్వాత సౌండ్స్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మూడేండ్ల నుంచి కంప్లయింట్ చేస్తున్నా మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదు. వారికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు. కానీ మాకు చాలా పెద్ద సమస్య. రెసిడెన్షియల్ ఏరియాల్లో సౌండ్ బారియర్స్ ఏర్పాటు చేయాలి.
- డాక్టర్ జి. హనుమాన్లు, ప్రెసిడెంట్, ఎంఎన్‌కె సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్కమిటీ
ఎక్కడెక్కడ ఎంత డెసిబుల్స్ ఉండాలంటే..
కేటగిరి డే టైమ్ నైట్ టైమ్
(ఉ. 6 నుంచి రా.10 వరకు) (రా.10 నుంచి ఉ.6 వరకు)
ఇండస్ట్రియల్ ఏరియా 75 70
కమర్షియల్ ఏరియా 65 55
రెసిడెన్షియల్ ఏరియా 55 45
సైలెన్స్ జోన్ 50 40