స్వాతంత్య్ర ఉద్యమంలో..మెట్​పల్లి ఖాదీ

భారతదేశంలో విదేశీ వస్తువుల ప్రవేశంతో  కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న మహాత్మా గాంధీ ఆశయం మేరకు స్వదేశీ ఉద్యమం బలోపేతమైంది. దీనిలో భాగంగా 1929లో అఖిల భారత చరఖా సంఘానికి అనుగుణంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో చరఖా సంఘం స్థాపించారు.  ఇక్కడి నుంచి స్వరాజ్యం కోసం స్వాతంత్ర్య ఉద్యమం జోరుగా కొనసాగింది. 

ప్రధానంగా స్వదేశీ వస్తువుల వినియోగానికి అనుకూలంగా,  విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో  వేల సంఖ్యలో  ప్రజలు  జైలుపాలయ్యారు.  నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మెట్​పల్లి ఖాదీ 78వ  స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర

మెట్​పల్లి  పట్టణంలో నేషనల్ హైవే 63 పక్కన 14 ఎకరాల్లో  నెలకొల్పిన  ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ స్వాతంత్య్ర ఉద్యమంలో  కీ రోల్  పోషించింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉద్యమాలు, సమావేశాలు అప్పట్లో మెట్​పల్లి ఖాదీ కేంద్రంగానే జరిగేవి.  ముఖ్యంగా విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఇక్కడి నేత కార్మికుల ఆధ్వర్యంలోనే  పెద్ద ఎత్తున జరిగింది.

ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటానికీ ఖాదీ కేంద్రంగా నిలిచింది.  నాటి స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న స్థానికులు తమ తుదిశ్వాస వరకూ ఖాదీ వస్త్రాలే ధరించడం విశేషం.

మెట్​పల్లి ఖాదీ చరిత్ర

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్​పల్లికి  దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉంది.  స్వదేశీ వస్త్రాల వినియోగం,  విదేశీ  వస్త్రాల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ  వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న అఖిల భారత చరఖా సంఘానికి అనుబంధంగా 1929లో మెట్​పల్లిలో ఖాదీ కేంద్రం ఏర్పడింది. చరఖా సంఘానికి  వైద్యనాథన్ చొరవతో మెట్​పల్లికి చెందిన వెంకటనర్సింహరావు దేశ్​ముఖ్ ఖాదీ స్థాపనకు 14 ఎకరాల తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. 

స్వాతంత్య్రం వచ్చాక అఖిల భారత చరఖా సంఘం  సర్వసేవా సంఘంలో విలీనం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా ఖాదీ సమితి ఏర్పడింది.  జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జాతీయ రహదారి పక్కనే పాత బస్టాండ్ వద్ద  విశాలమైనప్రదేశంలో మెట్​పల్లి ఖాదీని ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ  ప్రధాన శిష్యుడు అన్నాసాహెబ్ సహస్ర బుద్ధి 1929లో  మహారాష్ట్ర నుంచి కాలినడకన  వచ్చి మెట్​పల్లిలో  ఖాదీని స్థాపించారు. 1934 వరకు మహారాష్ట్ర  బ్రాంచ్ కింద పని చేసింది. 1951 నుంచి రామానందతీర్థ ఆధ్వర్యంలో మెట్​పల్లి పేరుతో  కొనసాగింది.  అనంతరం1967నుంచి మెట్​పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్​ పేరుతో  దివంగత  ప్రధాని పీవీ నర్సింహారావు అధ్యక్షుడిగా ఆవిర్భవించింది. 

సంస్థాపక అధ్యక్షుడిగా పీవీ

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సంస్థాపక అధ్యక్షుడిగా 1967 మే 1న మెట్​పల్లి ఖాదీ ప్రతిష్టాన్​ ఏర్పడింది.   స్వాతంత్ర్య సమరయోధుడు, మెట్​పల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రంగారావు  కార్యదర్శిగా, అన్నరెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎనిమిది మంది సభ్యులతో  ట్రస్టు బోర్డు ఏర్పాట యింది. మెట్​పల్లి ఖాదీ వస్త్రాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి.

తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్,  మహారాష్ట్ర,  ఉత్తరప్రదేశ్, అస్సాం, కర్నాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఖాదీ వస్త్రాలు ఎగుమతి అవుతాయి.  గంగారాం అనే నేత కార్మికుడు కుట్టు లేకుండా తయారుచేసిన  శార్వాణిని తొలి రాష్ట్రపతి బాబూ  రాజేంద్రప్రసాద్​కు, కుట్టులేని షర్ట్​ను తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూకు బహూ కరించారు.  దీంతో  మెట్​పల్లి ఖాదీ ఖ్యాతి దేశవ్యాప్తంగా తెలిసింది.

- మొహమ్మద్ షౌకత్ అలీ మెట్​పల్లి