17 మంది మలయాళీ నటులపై కేసులు

  • లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదు చేసిన సిట్
  • తాజాగా కంప్లైంట్  చేసిన సోనియా మల్హార్
  • నాకు బెదిరింపులు వస్తున్నాయి: మినూ మునీర్
  • నలుగురు నటులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ

తిరువనంతపురం/న్యూఢిల్లీ: మలయాళీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మొత్తం 17 మంది నటులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) కేసు నమోదు చేసింది. ఆ నటులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా మరో నటి సోనియా మల్హార్.. సిట్ కు ఫిర్యాదు చేశారు. అయితే, ఎవరిపై ఆరోపణలు చేశారో సోనియా వెల్లడించలేదు. అంతకుముందు నటులు ముకేశ్, జయసూర్య, మణియన్ పిల్ల రాజు, ఇడవేలు బాబు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి మినూ మునీర్  ఆరోపించారు. ప్రస్తుతం తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఒక బెదిరింపు సందేశాన్ని స్ర్కీన్​ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

బుధవారం ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. ‘‘ఒకసారి నేను షూటింగ్​లో ఉండగా.. టాయిలెట్​కు వెళ్లి బయటకు వచ్చాను. అప్పుడు జయసూర్య వెనుక నుంచి వచ్చి నన్ను హత్తుకుని ముద్దుపెట్టాడు. దీంతో నేను షాక్ కు గురై పారిపోయా. తనతో ఉంటే ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు ఇస్తానని అతను చెప్పాడు. అలాగే అమ్మ (​మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) మాజీ సెక్రటరీ ఇడవేలు బాబు నన్ను తన ఫ్లాట్​కు పిలిచించి భౌతిక దాడికి దిగాడు. సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్ కూడా వేధింపులకు పాల్పడ్డాడు. తన మాటను కాదనడంతో అమ్మలో నాకు సభ్యత్వం ఇవ్వలేదు” అని మునీర్  పేర్కొన్నారు.

మునీర్  ఆరోపణలు అబద్ధం: ముకేశ్

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ముకేశ్ స్పందించారు. మినూ మునీర్  చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆర్థిక సాయం చేయాలని గతంలో మునీర్  తనను కోరారని, తాను కాదనడంతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ గ్రూప్  డబ్బు కోసం తనను బ్లాక్ మెయిలింగ్  చేసేందుకు యత్నిస్తున్నదన్నారు. కాగా.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అమ్మ ప్యానెల్​ను రద్దుచేసిన విషయం తెలిసిందే. నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ప్రెసిడెంట్  మోహన్  లాల్  ఆ పదవికి రాజీనామా చేశారు.

ముకేశ్  రాజీనామా చేయాలి

లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముకేశ్  రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్  చేశారు. ముకేశ్ ను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నదని వారు ఆరోపించారు. హేమ కమిటీ రిపోర్టుతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్  విమర్శించారు. మలప్పురంలో మీడియాతో సతీశన్  మాట్లాడారు. హేమ కమిటీ రిపోర్టుపై నోరు విప్పాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కేరళ సినీ ఇండస్ట్రీలో మహిళా యాక్టర్లపై లైంగిక వేధింపులు దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా రాష్ట్ర సాంస్కృతిక మంత్రి సాజి చెరియాన్  మాట్లాడడంలేదని ఫైర్  అయ్యారు.