రూ.390 కోట్ల విలువైన మెడిసిన్ వృథా

  • 2016 - 2022 వరకు మెడిసిన్ కొనుగోలులో భారీగా ఉల్లంఘనలు
  • సర్కారు దవాఖాన్లకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 
  • నాసిరకం మందులు సప్లై చేసినట్టు వెల్లడించిన కాగ్
  • మ్యాండేటరీ టెస్టింగ్‌కు కూడా పంపలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్‌‌ఎస్ సర్కార్ హయాంలో మెడిసిన్​​ కొనుగోలులో భారీగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని కాగ్ వెల్లడించింది. 2016  నుంచి 2022 వరకు కొనుగోలు చేసిన మెడిసిన్‌‌లో సుమారు రూ.390.26 కోట్ల విలువైన మందులు పేషెంట్లకు అందుకుండానే ఎక్స్​పైరీ అయ్యాయని  పేర్కొంది. ఈ మేరకు 2016 నుంచి 2022 సంవత్సరాలకు సంబంధించిన కాగ్ రిపోర్టును ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో టేబుల్ చేసింది. 

సుమారు 54 బ్యాచ్‌‌ల మెడిసిన్‌‌ను టెస్టింగ్ చేయించకుండానే హాస్పిటళ్లకు సప్లై చేశారని, ఇందులో 47 బ్యాచుల మెడిసిన్‌‌ను పేషెంట్లకు ఇచ్చారని పేర్కొంది. ఈ అంశంపై గత ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరిగా లేదని కాగ్ పేర్కొంది. ఇక గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిలో 84 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్టు టెస్టింగ్ ల్యాబ్స్ తేల్చాయని వెల్లడించింది. దీనిపై గత బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. రూ.346.16 కోట్ల విలువైన మెడిసిన్‌‌కు సంబంధించిన వివరాలను ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేయకపోవడం వల్లే అవి ఎక్స్‌‌పైరీ అయినట్టుగా పోర్టల్‌‌లో చూపించిందని, వాస్తవానికి అవి పేషెంట్లకు సప్లై చేశామని తెలిపినట్టు కాగ్ వెల్లడించింది. 

మరో రూ.21.22 కోట్లను కంపెనీలకు చెల్లించలేదని, రూ.1.88 కోట్ల ఎక్స్‌‌పైరీ మెడిసిన్‌‌ను కంపెనీలకు పంపించి, తిరిగి మంచి మెడిసిన్‌‌ను తీసుకున్నట్టు గత ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ సమర్పించలేదని కాగ్ పేర్కొంది. డాక్టర్లు కోరిన వాటిలో చాలా మందులను గత ప్రభుత్వం హాస్పిటళ్లకు సప్లై చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 

నాసిరకంగా మెడికల్ ఎడ్యుకేషన్

 ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో 45 శాతం పోస్టులు (2022 నాటికి) ఖాళీగా ఉన్నాయని కాగ్ వెల్లడించింది. అత్యధికంగా మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని హాస్పిటళ్లు, కాలేజీల్లో 56 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. 48 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 40 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ ఖాళీల వల్ల మెడికల్ ఎడ్యుకేషన్ నాసిరకంగా తయారైందని కాగ్ పేర్కొంది.