వైద్యుల రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావాలే : పగడాల కాళీప్రసాదరావు

  •      ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు పగడాల కాళీప్రసాదరావు

పెద్దపల్లి, వెలుగు: వైద్యుల రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరుతున్నట్లు ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ పగడాల కాళీప్రసాదరావు చెప్పారు.   రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు కలిసి డాక్టర్​ రాజేశ్​పై దాడి చేశారు. 

ఆ దాడిని నిరసిస్తూ శుక్రవారం ఐఎంఏ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీప్రసాదరావు మాట్లాడుతూ..  వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించడం తప్ప ప్రాణాలు తీసే ఆలోచన డాక్టర్లకు ఉండదని పేర్కొన్నారు.

 కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించి మరణిస్తే అందుకు కారణం వైద్యులు కాదని తెలిపారు.  వైద్యుడు రాజేశ్ పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్​ వైద్యులు పాల్గొన్నారు.