ఈ సారి మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. బుధవారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మ గద్దెపైకి రావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. 24న అమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
- ఫిబ్రవరి 21న(బుధవారం) సమ్మక్క బిడ్డ వరాల తల్లి సారలమ్మను కన్నెపల్లి నుంచి పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకొచ్చి మేడారంలోని గద్దెపైకి చేర్చుతారు. నాలుగు రోజుల మహాజాతరలో తొలిఘట్టమిది. పిల్లల కోసం తపించే మహిళలు వరం పడతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా రోడ్డుపై పడుకుంటారు. పూజారులు వారిపై నుంచే నడుచుకుంటూ వస్తారు. మహబూబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో కొలువైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న గోవిందరాజులను సైతం ఇదే రోజు గద్దెలపైకి చేర్చుతారు. గిరిజన పూజారులు వీళ్లిద్దరిని కూడా బుధవారమే గద్దెకు తీసుకొస్తారు. మేడారం నుంచి పూనుగొండ్ల గ్రామం 60 కి.మీ దూరం ఉంటుంది. అయినా గిరిజన పూజారులు ఎంతో నియమనిష్టలతో అటవీ మార్గాన నడుచుకుంటూ వచ్చి గద్దెలపైకి పగిడిద్దరాజును చేర్చుతారు.
- ఫిబ్రవరి 22న (గురువారం) మేడారం మహాజాతరలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకలగుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తారు. దీంతో మేడారం ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోతుంది. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. రాత్రి వేళల్లో అమ్మవారిని గద్దెపైన ప్రతిష్ఠిస్తారు
- .
- ఫిబ్రవరి 23న (శుక్రవారం) మహాజాతరలో మూడవ రోజున అమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్
- తమిళి సై వనదేవతలను దర్శించుకుంటారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అమ్మలను దర్శించుకోవడానికి వస్తుంటారు. భక్తులు అమ్మలకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడి బియ్యం, బంగారంగా పిలిచే బెల్లం సమర్పిస్తారు.
- ఫిబ్రవరి 24న (శనివారం) నాలుగవ రోజు సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతలకు ఆవాహన పలికి అందరిని తిరిగి యథా స్థానానికి తరలిస్తారు. లక్షలాది మంది భక్తులను అనుగ్రహించిన సమ్మక్క సారలమ్మలు తిరిగి వనాల్లోకి వెళ్లిపోతారు. దీంతో మహాజాతర ముగుస్తుంది.కానీ జన జాతర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.