స్పోర్ట్స్‌‌‌‌ స్కూళ్ల అభివృద్ధితోనే పతకాలు: అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ను అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్‌‌‌‌ స్కూళ్లలో ఇంటర్ వరకే చదివిస్తున్నారని, స్కూల్ నుంచి బయటకు వెళ్లాక వారిని పట్టించుకోవడం లేదన్నారు. క్రీడాకారులు మెడల్స్ సాధించడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు.

పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులను గుర్తించాలని, వారు ఎదిగేందుకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ అలా ఎంకరేజ్ చేసినందుకే గుత్తా జ్వాల, సానియా మీర్జా వంటి క్రీడాకారులు తయారయ్యారని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్పోర్ట్స్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. గ్రౌండ్‌‌‌‌లేని స్కూళ్లపై, పీఈటీలు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సర్కార్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్‌‌‌‌ చేయాలని చెప్పారు.