సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు

  • మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్
  •  రాష్ట్రంలో 3 జిల్లాల్లో 100  స్కూల్స్  సెలెక్ట్
  •  మేఘశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాబ్ ల పంపిణీ 
  •  టెక్నాలజీ పద్ధతిలో బోధనకు ప్రత్యేక యాప్
  •  మ్యాథ్స్, సైన్స్, సోషల్ టీచర్లకు ట్రైనింగ్ 

మెదక్, వెలుగు : తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందింపజేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు బెంగళూర్ కు చెందిన మేఘశాల ట్రస్ట్ తో అగ్రిమెంట్ చేసుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లాను ఎంపిక చేయగా,  సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ ప్రోగ్రామ్ అమలుకు నిర్ణయించింది. మెదక్ కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎంపిక చేసిన స్కూల్ టీచర్లకు ట్యాబ్ లు అందజేశారు. త్వరలో యాదాద్రి జిల్లాలో కూడా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ట్రస్ట్ ప్రతినిధులు ఎంపిక చేసిన స్కూళ్లకు వెళ్లి ట్యాబ్ ల్లో యాప్ ను ఇన్ స్టాల్ చేస్తున్నారు. అన్ని స్కూళ్లలో ప్రక్రియను పూర్తి చేసి.. వారం రోజుల్లో ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన షురూ చేస్తారు.  సర్కార్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడలేదు. ప్రధానంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించలేకపోతున్నారు. స్కూల్ లెవల్ లో పాసవుతున్నా.. ఇంటర్ కు వెళ్లే సరికి సబ్జెక్టులపై పట్టు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీంతో హైస్కూల్ లెవల్ లోనే విద్యార్థు ల్లో నైపుణ్యాలు పెంపొందింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు విద్యాభివృద్ధికి చేయూత అందిస్తున్న మేఘశాల ట్రస్ట్ సాయంతో టెక్నాలజీ పద్ధతుల్లో సర్కార్ బడుల్లో విద్యా నైపుణ్యాలు పెంచేందుకు శ్రీకారం చుట్టింది. 

 టెక్నాలజీ ద్వారా బోధన 

కర్నాటకలోని బెంగళూర్ లో 2013లో ఏర్పాటైన మేఘశాల ట్రస్ట్  ఆ రాష్ట్రంతో పాటు తమిళనాడు, మేఘాలయ, సిక్కిం, ఢిల్లీ రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ట్యాబ్ ద్వారా పాఠాలు బోధించేందుకు టీచర్ ఎనబుల్ మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రోగ్రామ్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు మేఘశాల ట్రస్ట్ తో స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ఏడాదికి ఎంవోయూ కుదుర్చుకుంది. 

ప్రత్యేక యాప్ ద్వారా టీచింగ్

పైలెట్ ప్రాజెక్ట్ గా మెదక్ జిల్లాలో 40, సిద్దిపేట జిల్లాలో 30, యాదాద్రి జిల్లాలో 30 హై స్కూళ్లను ఎంపిక చేసింది. ఆయా స్కూళ్లలో 6,7,8 క్లాసుల విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠాలు బోధించేలా ప్లాన్  చేసింది. మేఘశాల పేరుతో ప్రత్యేక యాప్ ను రూపొందించింది. మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఎస్ సీఈఆర్ టీ సబ్జెక్టు సిలబస్ ను విద్యార్థులు ఆసక్తిగా వినేలా, సులభంగా అర్థం చేసుకుని గుర్తు పెట్టుకునేలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కన్వర్ట్ చేసి ట్యాబ్ లో పొందుపర్చారు. వీడియోలు, ఇమేజ్ ల ద్వారా ఆయా సబ్జెక్ట్ పాఠాలను విద్యార్థులకు టీచర్లు బోధించనున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లల్లో  క్లాస్ కు ఒకటి చొప్పున మూడు ట్యాబ్ లను అందజేశారు. 

సబ్జెక్ట్  టీచర్లకు శిక్షణ

ఇప్పటికే మూడు జిల్లాల్లో ఎంపిక చేసిన స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ట్రస్ట్ ప్రతినిధులు ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు ఇంట్రస్ట్ కలిగేలా పాఠ్యాంశాలు, ఈజీగా అర్థమయ్యేలా ఎలా బోధించాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. యాప్ ద్వారా పాఠ్యాంశాలు బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఆయా సబ్జెక్ట్ ల్లో నైపుణ్యాలు మెరుగవుతాయని మేఘశాల ట్రస్ట్ ఇంటర్నల్ ఆపరేషన్ లీడ్ జయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే అమలయ్యే రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ మంచి ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు.

ఆఫ్ లైన్ లోనూ పాఠాలు వినొచ్చు

మేఘశాల యాప్ ద్వారా విద్యార్థులు ఈజీగా పాఠ్యాంశాలు నేర్చుకునే అవకాశం ఉంది. కొన్ని విషయాలను, భావనలను విద్యార్థుల మనసులకు హత్తుకునేలా తెలియజేయొచ్చు. ట్యాబ్ లతో ప్రతిభావంతమైన బోధన కొనసాగుతుంది. పాఠ్యాంశాలను ఒక్కసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి డాటా లేకుండా ఆఫ్  లైన్ లో చూసుకోవచ్చు. ఇందులో టీచర్లకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, పాఠ్యాంశాలు,  తెలంగాణ కరికులమ్ కు అనుగుణంగా పొందుపరిచారు. 


– వైద్య  శ్రీనివాస్, టీచర్, జెడ్పీహెచ్ఎస్  అంసాన్ పల్లి, మెదక్ జిల్లా-

టీచర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలి 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మేఘశాల ట్రస్ట్  అందించిన ట్యాబ్ లు ఎంతో ఉపయోగపడుతు న్నాయి.  జిల్లాలోని వివిధ పాఠశాలకు అందించిన ట్యాబ్ లను కూడా టీచర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. శిక్షణలో నేర్పిన అంశాలను పక్కాగా ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజు క్లాస్ రూమ్ లో ట్యాబ్ లను ఉపయోగించి విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనను పెంపొందించాలి. అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తీర్చిదిద్దాలి. హెచ్ఎంలు ట్యాబ్ వాడకాన్ని రోజూ పరిశీలించి ఏమైనా సమస్యలుంటే సంస్థ  ప్రతినిధులతో నివృత్తి చేసుకోవాలి. 


– రాధాకిషన్, డీఈఓ, మెదక్ జిల్లా