బలశాలి మన సింగరేణి! : ఎండి. మునీర్

చెమట చుక్కలు మెరిసాయి, మంచి ఫలితాలు వచ్చాయి. చీకటి రాత్రులు, రోజులు పోయాయి. మన కష్టం విజయం సాధించింది. నల్ల నేల, మన సింగరేణి బొగ్గు బావుల కార్మికుల కష్టం  ఫలించింది.2023-–24 ఆర్థిక సంవత్సరం లో ఏడాది ఉత్పత్తి లక్ష్యం అయిన 70 మిలియన్ టన్నులు సింగరేణి సాధించింది. మూడు వేల కోట్ల రూపాయలు నికర లాభాలు సాధించడం ఆల్ టైం సింగరేణి రికార్డు కాగా,  సంస్థ టర్నోవర్ రూ.37 వేల కోట్లకు చేరే పరిస్థితి వచ్చింది!  135 సంవత్సరాల సింగరేణి చరిత్రలో 2023-– 24 ఆర్థిక సంవత్సరం ఒక చారిత్రకమైన రికార్డును నమోదు చేసిన సంవత్సరంగా లిఖించబడుతుంది.

దేశంలో మొదటి ప్రభుత్వ రంగ సంస్థ

సింగరేణి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఏడాది  ఏడు వేల కోట్లకు పైగా పన్నులు, రాయల్టీ, డివిడెండ్లు ఇతర సెస్ లు చెల్లించడమే కాదు, బొగ్గు గనులు ఉన్న జిల్లాలకు డిఎంఎఫ్టి నిధులు వేల కోట్లలో చెల్లించడం, ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరగడం చూస్తున్నాం.--- 1990 దశకంలో సింగరేణి రెండు సార్లు బీఐఎఫ్ఆర్ లోనికి వెళ్లి, ఖాయిలా మార్క్ నుంచి తప్పించుకుని బయట పడిన మొట్టమొదటి సంస్థగా పేర్కొనవచ్చు! అప్పుడున్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా సింగరేణి కి వెయ్యి కోట్లకు పైగా సహాయం అందచేసింది. అప్పటి కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి ఇందుకోసం, కార్మిక సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు కృషి చేశారు. సంస్థ అప్పు మీద పది ఏండ్ల మారిటోరియం అనంతరం రూ.663 కోట్ల వడ్డీని కూడా దఫాల వారీగా సింగరేణి చెల్లించింది.1998 అనంతరం 2000-–01 లో మొదటిసారి భారీ నష్టాల నుంచి సింగరేణి లాభాల్లోకి వచ్చింది.-----

మొదట లాభాలను పంచింది చంద్రబాబే

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సింగరేణిలో  సమ్మె జరుగుతున్న నేపథ్యంలో నిర్మల్​కు వచ్చారు. ఆ సభలో సీఎం సింగరేణి కార్మికులు సమ్మె విరమణ చేయాలని కోరుతూ,  ఏదో యధాలాపంగా సంస్థకు నష్టం వస్తే కార్మికుల వేతనాల నుంచి కోత విధిస్తామని, లాభాలు వస్తే వాటా పంచి ఇస్తామని ప్రకటన చేశారు. ఇదే నేపథ్యంలో సింగరేణికి లాభాలు వచ్చాయి. మొట్టమొదటిసారి సింగరేణిలోని అప్పటి గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కేఎల్. మహేంద్ర సీఎం ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఒత్తిడి చేశారు. దీనితో సంస్థ మొదటి సారి లాభాల నుంచి 10 శాతం వాటా బోనస్ కార్మికులకు, అధికారులకు ఇచ్చారు. అదే ఇప్పటి దాకా లాభాలను బట్టి వాటా పెంచుకుంటూ, ప్రతిఏడు ఇస్తూ వస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో, చివరికి కోల్ ఇండియాలోనూ లాభాల్లో వాటా ఇచ్చే విధానం లేదు!  ఒక్క సింగరేణిలోనే ఉన్నది. ఎవరు అవునన్నా  కాదన్నా ఈ క్రెడిట్ చంద్రబాబునాయుడుదే అని పేర్కొనక తప్పదు! 

సింగరేణి తెలంగాణ కొంగుబంగారం
--
మరో150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలు ఉన్నాయి.------తవ్వి తీసిన దానికన్నా, తీయాల్సిన బొగ్గు10 వేల మిలియన్ టన్నుల దాకా ఉన్నది. ఇంకో 150 ఏండ్లు తవ్వి తీసినా తరగని రాక్షసి బొగ్గు నిక్షేపాలు గోదావరి తీరంలో సమృద్ధిగా ఉన్నాయి. కొత్త బొగ్గు బ్లాక్ ల కేటాయింపు, తద్వారా బొగ్గు అవసరాలు, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం కోసం సీఎండీ  ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఆవరణలోనే మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నారు.   సోలార్ ప్లాంట్ లను కూడ విస్తరించే పని,  ఐరన్ ఓర్ తదితర రంగంలోనూ సింగరేణి ప్రవేశం కోసం యోచిస్తున్నది. తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణి,  ఈ ప్రాంతం ప్రజల, గుండెకాయ, నిరుద్యోగుల ఊపిరి లాంటిది. సంస్థను నాలుగు కాలాలపాటు కాపాడుకోవాలి. ఉపాధికి అవకాశాలు పెంచాలి. --ప్రస్తుత సీఎండీ బలరాం పైన సింగరేణీయులకు విశ్వాసం, నమ్మకం ఉన్నది. అందరికీ న్యాయం జరుగుతుందనే ఆశ ఉన్నది. సింగరేణి సాధించినదానికి మించి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కలిసి ఈ ప్రాంతం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారని ఆశిద్దాం!---------------------------------- 

కొత్త సీఎండీ కృషి 

సింగరేణి కి రాష్ట్రం లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎండీ గా ఐఆర్ఎస్ అధికారి ఎన్. బలరాంను నియమించారు. సంస్థ మీద సీఎం సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. బొగ్గు సరఫరా బకాయిల్లో 1200 కోట్ల దాకా సింగరేణికి ఇచ్చారు. కొత్త బొగ్గు బ్లాక్ ల కోసం సీఎండీ, డిప్యూటీ సీఎం లు ఢిల్లీ దాకా వెళ్లి వచ్చారు. ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల మీద, నిరుద్యోగుల్లో స్కిల్ డెవలప్​మెంట్ కోసం కృషి చేస్తున్నారు. సింగరేణి లో సూపర్ స్పెషాలిటి  ఆసుపత్రులు ఏర్పాటు చేసి మంచి కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యం కోసం సీఎండీ కృషి చేస్తున్నారు.

- ఎండి. మునీర్, 
సీనియర్ జర్నలిస్ట్

 

  • Beta
Beta feature
  • Beta
Beta feature