టైమ్​కు డ్యూటీకి రాకపోతే జీతాలు కట్

 

  • జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ ఆకస్మిక తనిఖీ   
  • మధ్యాహ్నం 12 గం.కు సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహం
  • అదే టైమ్​లో డ్యూటీకి వచ్చి అధికారుల నిలదీత
  • ఇకపై  ఉదయం 10.35 తర్వాత అన్ని విభాగాల 
  • అటెండెన్స్ రిజిస్టర్లు నా టేబుల్​ మీద ఉండాలి 
  • త్వరలో బయోమెట్రిక్ పెడతామని మేయర్​ స్పష్టం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు టైమ్​కు డ్యూటీకి రాకపోతే జీతాలు కట్ చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల టైంలో జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని అన్ని విభాగాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాలా మంది సీట్లు ఖాళీగా కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ సెక్షన్ లో ఆఫీసర్​తోపాటు సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు. మేయర్​తనిఖీ చేస్తున్న టైమ్​లో డ్యూటీలకు వచ్చిన ఆఫీసర్లను నిలదీశారు. అప్పటికే సీట్లలో ఉన్న పలువురు ఉద్యోగులను ‘ఆఫీస్ టైమ్​ ఎప్పుడు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు?’ అని అడిగారు. 

కొందరు ఆలస్యంగా వచ్చినట్లు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. హెడ్డాఫీసులోని పలు విభాగాల ఉద్యోగులు ఉదయం ఆలస్యంగా వస్తున్నారని, సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్లిపోతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయని చెప్పారు. సమయ పాలన పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ఆలస్యంగా వచ్చి సాకులు చెప్పొద్దని హెచ్చరించారు. విధులకు ఆలస్యంగా వచ్చినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇకపై ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

 ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 లోపు ఆఫీసులో ఉండాలని, 10:35 తర్వాత అన్ని విభాగాల అటెండెన్స్​రిజిస్టర్లు తన చాంబర్​కు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులకు సర్క్యులర్​జారీ చేయాలని అడ్మిన్ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతిని ఆదేశించారు.10:30 తర్వాత డ్యూటీకి వచ్చే ఉద్యోగులపై చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల అడెండెన్స్​పై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. త్వరలోనే బయోమెట్రిక్ అటెండెన్స్ అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అధికారులు సమయానికి రాకపోవడంతోనే పలు ఫైల్స్ పెండింగ్ పడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మేయర్ వెంట అడ్మిన్ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి, అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా ఉన్నారు.