నిజామాబాద్, వెలుగు: మున్సిపల్ కార్పొరేషన్ ఇన్కమ్ దెబ్బతినకుండా యంత్రాంగం పనిచేయాలని నగర పాలిక సంస్థ మేయర్ దంతు నీతూకిరణ్ సూచించారు. నివాస గృహాల పర్మిషన్లు తీసుకొని కమర్షియల్‌గా ఉపయోగిస్తున్న భవనాలు గుర్తించి యాక్షన్ తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆమె కార్పొరేషన్‌లోని టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నిర్మాణాలు పూర్తయి ట్యాక్స్ పరిధిలోకి రాని వాటినీ ఐడెంటీఫై చేయాలన్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలు గుర్తించాలన్నారు.
అక్రమ నల్లా కనెక్షన్ల లెక్క తేల్చాలన్నారు. డంపింగ్ యార్డులో స్టార్ట్ చేసిన బయో మైనింగ్ పనుల వేగం పెంచాలని, వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలే అవకాశాలున్నందున నాలాలు శుభ్రంగా ఉంచాలన్నారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు తడిసి కూలే శిథిల ఇండ్లను గుర్తించాలని, శివారు కాలనీలలో ఎల్ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
నగరంలో ఇండ్ల నుంచి చెత్తసేకరణ సరిగా లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్ జిమ్‌లన్నీ వాడుకలో ఉండేలా చూడాలని క్రీడా ప్రాంగణాలలో వసతులు పెంచాలన్నారు. వర్షం నీరు లోతట్టు కాలనీలలోకి వెళ్లకుండా టెంపరరీ డైవర్షన్ కెనాల్స్ నిర్మించాలన్నారు. హరితహారం మొక్కలు రెడీగా పెట్టాలన్నారు. అడిషనల్ కమిషనర్ శంకర్, ఆర్వో నరేందర్,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.