Good News : ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం.. మన దగ్గర ఎందుకిలా ఉండవు..?

మేఘాలయలోని మౌలినాంగ్ అనే చిన్న గ్రామం ఆసియా ఖండంలోనే అతి శుభ్రమైన గ్రామం. కేవలం 500 మంది జనాభా మాత్రమే ఉన్న ఈ ఊరు మేఘాలయ రాజధాని షిల్లాంగు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

చిన్నగ్రామమైనా ఇక్కడి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన చాలా ఎక్కువ. ప్రతి ఇంటి ముందు ఒక చెత్త బుట్ట ఉంటుంది. అది కూడా ప్రకృతికి ఏమాత్రం హాని చేయని వెదురుతో చేసింది. మౌలినాంగ్ గ్రామ ప్రజలు దారి వెంట వెళ్తున్నప్పుడు చెత్త కనిపిస్తే చాలు.. ఇంటి ముందు ఉన్న చెత్తబుట్టలో వేస్తుంటారు. ఇళ్లను కూడా వెదురుతో నిర్మించుకున్నారు. అంతేకాదు మౌలినాంగ్లో వెదురుకర్రలతో 85 అడుగుల టవర్ నిర్మించారు. దాని పైకి ఎక్కి చూస్తే గ్రామం మొత్తం కనిపిస్తుంది.

 అంతేకాదు.. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు కూడా కనిపిస్తాయి. గ్రామం చుట్టూ ప్రవహించే సరస్సులు, చెరువుల్లో నీళ్లు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. నీటి అడుగున ఏముందో కూడా సులభంగా చూసేయొచ్చు. ఇక్కడి వంతెనలు కూడా చెట్ల వేర్లతో చేసినవే కావడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. గ్రామ ప్రజలు ఇంటర్నెట్ వాడరు. పైగా ఎవరికీ మొబైల్ ఫోన్స్ కూడా లేవు.