- ఇయ్యాల అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబసభ్యులు
గోదావరిఖని, వెలుగు : ములుగు జిల్లా చెల్పాక ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ మహాదేవపూర్, ఏటూరునాగారం ఏరియా కార్యదర్శి వేగోలపు మల్లయ్య అలియాస్ కోటి అలియాస్ మధు మృతదేహాన్ని ఆరురోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం సొంతూరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు తీసుకొచ్చారు.
గ్రామస్తులు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు, పౌర హక్కు ల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల లీడర్లు తరలివచ్చిన ఘనంగా నివాళులర్పించారు. అన్నంలో విషం పెట్టి సృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని కాల్చి చంపారని మల్లయ్య భార్య మీనా హైకోర్టును ఆశ్రయించగా, ఏటూరు నాగారం హాస్పిటల్లో డెడ్‌బాడీని భద్రపరిచారు.
అనంతరం గురువారం కోర్టు ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్‌కాలేజీ డాక్టర్లు తిరిగి పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం మల్లయ్య డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య మీనాతో పాటు సోదరుడు రాజయ్య వచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా గత నెల 30న చెల్పాక ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే.