యాదాద్రి థర్మల్ ప్లాంట్​లో మళ్లీ మెటీరియల్ చోరీ

  • పోలీసుల అదుపులో ఐరన్ స్క్రాప్ వ్యాపారి సహా ఇతర ముఠా సభ్యులు 
  • విచారణ చేపట్టిన ఖాకీలు
  • కేసు నుంచి బయటపడేందుకు కీలక సూత్రదారుల ప్రయత్నం  

మిర్యాలగూడ, వెలుగు :  యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ లో మళ్లీ మెటీరియల్ చోరీ జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి ఐరన్, అల్యూమినియం, ఇతర మెటీరియల్ ను చోరీ చేసి అక్రమంగా తరలిస్తుండగా ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ తండాకు చెందిన ముగ్గురు యువకులే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఐరన్, అల్యూమినియం, ఇతర విలువైన మెటీరియల్ ను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

థర్మల్ పవర్ ప్లాంట్ పనులను దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగులు, కొందరు ఇంజినీర్లు, చోరీ ముఠా సభ్యులతో కుమ్మక్కై ఐరన్, అల్యూమినియం చోరీ చేసి ఐరన్ స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈనెల 7న సాయంత్రం ఆటోలో ఐరన్, అల్యూమినియం మెటీరియల్ ను తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అక్రమాల భాగోతం బయటపడింది. మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ జంక్షన్ లో ఐరన్ స్క్రాప్ షాప్ కు సంబంధించిన ఓ వ్యాపారి యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి చోరీ చేసిన మెటీరియల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ దొంగల ముఠాతోపాటు మహిళా వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు నెలలు తిరగకముందే మళ్లీ చోరీ..! 

వీర్లపాలెం వద్ద ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ను సుమారు రూ.30 వేల కోట్లతో చేపట్టింది. ఈ ప్లాంట్​ నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్ దక్కించుకుంది. మూడు నెలల క్రితమే యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి కోట్ల విలువైన మెటీరియల్ చోరీ చేసి తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మూడు నెలలు తిరగకముందే మరో ముఠా ఆటోలో యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి మెటీరియల్ దొంగిలించి తరలిస్తుండగా ఖాకీలకు చిక్కారు. 

 రెండేళ్లుగా మెటీరియల్ అపహరణ.. 

యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి రెండేళ్లుగా అల్యూమినియం, బ్రాస్, జీఐ బండిల్స్ సహా ఇతర మెటీరియల్ చోరీ అవుతోంది. ఈ ప్లాంట్ లోని ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగులు అక్రమార్కులతో జతకట్టి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మేలో యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి మెటీరియల్ చోరీ చేసి తరలించే క్రమంలో ఓ ముఠా పట్టుబడింది. 2023 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మే వరకు రూ.6.05 కోట్ల విలువైన అల్యూమినియం, బ్రాస్, జీఐ బండిల్స్ అపహరించినట్లు బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతినిధులు వాడపల్లి పోలీసులకు మే 29న ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.71 లక్షల మెటీరియల్, రూ.20 లక్షల విలువైన కారు, ఆటో, రూ.58 లక్షల నగదుతో కలిపి రూ.1.49 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  

కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు.. 

యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి విలువైన మెటీరియల్ ను దొంగిలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు ముఠా సభ్యులు.. అధికార పార్టీ నేతలను ఆశ్రయించి కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. దొంగిలించిన మెటీరియల్ ను అమ్మేయగా వచ్చిన డబ్బులతోనే అవసరమైన వారందరినీ మేనేజ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

కాగా ప్లాంట్ నుంచి ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మెటీరియల్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. అనధికారికంగా అపహరణకు గురైన మెటీరియల్ విలువ రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చోరీ చేసిన మెటీరియల్ మొత్తం రికవరీ చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.