సుడా, రుడాలకు రెడీ కాని మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్లు

  •     కరీంనగర్‌‌‌‌‌‌‌‌, రామగుండం బల్దియాల్లో మాస్టర్‌‌‌‌ ప్లాన్లకు డిసెంబర్​ డెడ్​లైన్​ 
  •     ఇంకా పూర్తి కాని ముసాయిదాలు, స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్  
  •     గడువులోగా పూర్తి చేయకుంటే అమృత్ ఫండ్స్‌‌‌‌ విడుదల కష్టమే

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ శాతావాహన అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్(సుడా)తో సహా రామగుండం డెవలప్​మెంట్​ అథారిటీ(రుడా)లకు మాస్టర్​ ప్లాన్లు ఇంకా రెడీ కాలేదు. వచ్చే 20 ఏళ్ల కోసం మాస్టర్ ప్లాన్ – 2041 లక్ష్యంతో 2019లో ప్రారంభించిన పని ఇంకా డ్రాఫ్ట్‌‌‌‌దశలోనే ఉంది. గడువులోగా డ్రాఫ్ట్‌‌‌‌ సిద్ధం కాకపోతే అమృత్‌‌‌‌ ఫండ్స్ విడుదల కష్టమేనని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అమృత్ స్కీమ్ నిధులతో రూపొందిస్తున్న సుడా, రామగుండం సహా10 పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్ల డ్రాఫ్ట్ లు సిద్ధం చేయాల్సి ఉండగా..అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ ప్లాన్ల ప్రిపరేషన్ కు డిసెంబర్ 31తో గడువు ముగుస్తున్నప్పటికీ ఇంకా ముసాయిదాను సిద్ధం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెడ్ లైన్ లోగా ఈ ప్లాన్లకు ఆమోదం తెలిపి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు పంపకపోతే.. అమృత్ స్కీమ్ కింద విడుదల కావాల్సిన నిధులు రావడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే కోట్లాది రూపాయల ఖర్చు భారం ఆయా పట్టణాభివృద్ధి సంస్థలపైనే పడే ప్రమాదముందని ఎంఏయూడీ ఆఫీసర్లు చెప్తున్నారు. వచ్చే మూడు నెలల్లోనైనా స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్‌‌‌‌ మీట్టి, మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పై చర్చించి  ఫైనల్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంది. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు రింగ్ రోడ్డు.. 

కరీంనగర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 1976లో మొదటిసారిగా మాస్టర్ ప్లాన్ రూపొందించగా..  1998లో ఆ ప్లాన్‌‌‌‌ను రివైజ్​ చేశారు. 2018లో మరోసారి రివైజ్డ్ చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత సుడా ఏర్పాటు కావడంతో మాస్టర్ ప్లాన్ కు  2019లో ఏజెన్సీల నుంచి టెండర్లు పిలిచారు. దీంతో ఐదేళ్లుగా మాస్టర్ ప్లాన్ పై కసరత్తు జరుగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్ల విభజన, ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి, కొత్తగా కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం, పార్కులు వివరాలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. కరీంనగర్ కు సంబంధించి సుడా మాస్టర్ ప్లాన్ లో ఓ రింగ్ రో డ్డును కూడా చేర్చినట్లు తెలిసింది.

మాస్టర్ ప్లాన్ వర్క్ మొదలుపెట్టాక వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా నేషనల్ హైవే మంజూరు కావడంతో.. దానికనుగుణంగా ప్లాన్ లో మరికొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. రాజీవ్ రహదారి,  నేషనల్ హైవే ను కలుపుతూ వేములవాడ రోడ్డు వరకు రింగ్ రోడ్డు డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా కరీంనగర్ కు ఒకవైపు లోయర్ మానేరు డ్యామ్ ఉన్నందున రింగ్ మాదిరిగా కనెక్ట్ చేయడం కుదరకపోవచ్చని సుడా ఆఫీసర్లు వెల్లడించారు. త్వరలోనే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో చర్చించి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ తేదీలు ఖరారు చేస్తామని, వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్ కు తుది రూపం తీసుకొస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.  

పూర్తి కాని డ్రాఫ్ట్‌‌‌‌లు, స్టేక్ హోల్డర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌లు 

అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్(అమృత్) స్కీమ్ కింద రాష్ట్రంలో  ఎంపిక చేసిన 10 సిటీల పరిధిలో మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కు కేంద్రం నిధులు కేటాయించింది. ఇందులో కరీంనగర్ లో శాతవాహన అర్బన్ డెవలపమెంట్ అథారిటీ(సుడా), రామగుండం అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ(రుడా)తో సహా మరో 8 పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి.

ఇందులో కొన్ని మాస్టర్ ప్లాన్ల ముసాయిదాపై ఇప్పటికే ఒకటి, రెండు సార్లు వివిధ రాజకీయ పార్టీల, వాణిజ్యం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ తదితర అన్ని శాఖల ఆఫీసర్లతో స్టేక్ హోల్డర్ల మీటింగ్ నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నప్పటికీ.. మరోసారి ఫైనల్ గా సమావేశం నిర్వహించి చేర్పులు, మార్పులపై అభిప్రాయ సేకరణ చేపట్టలేదు.