బాసర మాస్టర్ ప్లాన్ ఏమాయే?

  • నిధులు లేక మొదలుకాని పనులు
  • శంకుస్థాపనలకే పరిమితం
  • ఆరేళ్లు గడుస్తున్నా అడుగడుగునా నిర్లక్ష్యం
  • కాగితాలకే పరిమితమైన రూ.50 కోట్లు

నిర్మల్, వెలుగు: చదువుల తల్లి క్షేత్రమైన బాసర సరస్వతి దేవి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకే చెందిన దేవాదాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర మాస్టర్ ప్లాన్​పై సీరియస్​గా దృష్టి పెట్టకపోవడంతో ఆలయ అభివృద్ధి పనులకు మోక్షం లభించలేదు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా తమ పిల్లల అక్షరాభ్యాసాలను జరుపుతుంటారు. ఏండ్లుగా ఆలయంలో  సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పండుగ వేళల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు.

భూమి పూజ చేసి వదిలేశారు

 బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఆలయం అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో ఆలయ అభివృద్ధి కోసం నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే 2018లో జిల్లాకు వచ్చిన అప్పటి కేసీఆర్ యాదాద్రి తరహాలో బాసర సరస్వతి దేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ముందుగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ నిధులకు సంబంధించి జీవో నంబర్ 486ను కూడా జారీ చేశారు.

మాస్టర్ ప్లాన్​లో భాగంగా కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను తయారుచేశారు. ఆ తర్వాత నిర్లక్ష్యం మళ్లీ కొనసాగింది. దీంతో అంతటా విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు గతేడాది మార్చి 24న అప్పటి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాస్టర్ ప్లాన్ పనులకు భూమి పూజ చేశారు. నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో అభి వృద్ధి పనులు 
జరగలేదు.

అన్నీ సమస్యలే..

బాసర ఆలయంలో అడుగడుగునా భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్లు, వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి సంబంధించి సరైన సౌకర్యాలు లేవు. పవిత్ర స్నానాలు ఆచరించే గోదావరి స్థానవాటికల వద్ద సరైన వసతులు కల్పించకపోవడంతో మహిళా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

కొత్త సర్కారుపై ఆశలు

ఆలయాల అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాసర ఆలయాభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో బాసర ఆలయ అభివృద్ధిపై భక్తులు, స్థానికుల్లో ఆశలు చిగురించాయి. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం బాసర సరస్వతి దేవి ఆలయ అభివృద్ధి విషయంలో నాడు కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సరస్వతి ఆలయాభివృద్ధిని దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

భద్రతపై నిండా నిర్లక్ష్యం

సరస్వతీ దేవి ఆలయ భద్రతపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇటీవల ఆలయంలో చోరీ, మరికొన్ని ఘటనలు భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతు న్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు భద్రత విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా సిబ్బందిపై పర్యవేక్షణ కరువవడం, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సిస్టంపై నియంత్రణ లేకపోవడం భద్రతాలోపాలకు కారణమవుతోంది.