పోతంగల్ సొసైటీలో భారీగా అవకతవకలు

  • విచారణలో బయటపడ్డ అక్రమాలు
  • రూ.58 లక్షల అవినీతి జరిగిందని గుర్తించిన అధికారులు
  • సెక్రటరీ, చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రికవరీకి ఆదేశం

కోటగిరి, వెలుగు : నిజామాబాద్ జిల్లా పోతంగల్ సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత మహాజన సభలో సభ్యులు చేసిన తీర్మానం మేరకు సొసైటీలో జరిగిన అవకతవకలపై సహకార చట్టం 51 కింద విచారణకు అధికారులు ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీసీవో శ్రీనివాస రావు గురువారం జరిగిన మహాజన సభలో చదివి వినిపించారు. ఎంక్వెయిరీ నివేదిక ఆధారంగా సంఘం పాలక వర్గం, సీఈవో ఆర్థిక, పరిపాలన, చట్టపరమైన అవకతవకలకు పాల్పడినట్లు తెలిపారు. 

సంఘం నుంచి సకాలంలో పీఎఫ్ చెల్లించకపోవటంతో సంఘానికి రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పారు. వ్యాట్, కమర్షియల్ ట్యాక్స్ లో రూ.20 లక్షలు, ఐటీ చెల్లింపుల్లో నోటీసులను నిర్లక్ష్యం చేసి రూ.28 లక్షలు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఎకౌంట్ నుంచి డెబిట్ చేసి క్యాష్ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయకుండా  రూ.లక్ష సొంత  అవసరాలకు వాడుకున్నారని  ఎంక్వెయిరీ ఆఫీసర్ గుర్తించారని చెప్పారు.  సెక్రటరీ, చైర్మన్ ఇరువురు సహకార సంఘ విధివిధానాలను అనుసరించకపోగా, రిజిస్టర్లను సైతం సరిగా నిర్వహించలేదని వెల్లడించారు.  

సొసైటీకి జరిగిన నష్టాన్ని సీఈవో, చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి  రికవరీ చేస్తామని తెలిపారు. ఆర్థిక  అవకతవకలకు పాల్పడినందున బాధ్యులపై ఐపీసీ సెక్షన్ 408 కింద క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.  దీంతో పాటు సంఘానికి రావాల్సిన రిబేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డీసీసీబీ రూ.12 లక్షలు ఎలా తీసుకుంటారని పాలకవర్గాన్ని సభ్యులు నిలదీశారు. 2018లో సంఘంలోని 776 మంది రైతుల  రుణమాఫీని రైతుల ఖాతాలో జమ చేయకుండా సొసైటీ నిర్వాహకులే పక్కదోవ పట్టించారని సభ్యులు డీసీవో దృష్టికి తీసుకెళ్లారు.