దసరా, దీపావళి పండుగల వేళ.. పటాకుల దందా!

  • దసరా, దీపావళి కోసం భారీగా అక్రమ ఫైర్ క్రాకర్స్ డంప్ లు
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్మిషన్ లేకుండా ఇండ్ల మధ్య నిల్వ
  • ఎలాంటి భద్రతాచర్యలు తీసుకోకుండానే అమ్మకాలు
  • అనుకోని ప్రమాదం సంభవిస్తే  పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి చాన్స్
  • మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోని వివిధ శాఖల ఆఫీసర్లు
  • టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడుతున్న పటాకుల అక్రమ గోదాములు

హనుమకొండ, వెలుగు : దసరా, దీపావళి పండుగల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పటాకుల అక్రమ దందా జోరుగా నడుస్తోంది. ఫెస్టివల్స్​సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే భారీగా తెచ్చి గోదాముల్లో నింపేస్తున్నారు. అనుమతులతో పాటు కనీస భద్రతా చర్యలు కూడా తీసుకోకుం డానే ఇండ్లు, కాలనీల మధ్య నిల్వ చేస్తున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది. తనిఖీలపై ఫైర్​సేఫ్టీ, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు లైట్​తీసుకుం టున్నారు. ఇటీవల వరంగల్ టాస్క్​ఫోర్స్​తనిఖీల్లో పెద్ద ఎత్తున ఫైర్​క్రాకర్స్ డంపులు బయటపడ్డాయి. 

ఏటా రూ.కోట్లలో దందా

తమిళనాడులోని శివకాశి, ఏపీలోని ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఫైర్​క్రాకర్స్ ను భారీగా తయారు చేస్తుంటారు. రాష్ట్రంలోనూ హైదరాబాద్​చుట్టుపక్కల కూడా పదుల సంఖ్యలో తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ లో కూడా రెండు పరిశ్రమలు ఉండగా.. ప్రస్తుతం ఒక్కదాంట్లోనే తయారు చేస్తున్నారు. పండగల సీజన్​వస్తుండగా.. వరంగల్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా పటాకులు తెప్పిస్తూ.. ఎలాంటి పర్మిషన్​లేకుండానే డంప్​చేస్తున్నారు. పైగా ఎమ్మార్పీపైన ఐదారు రెట్లు పెంచి స్టిక్కర్లు అంటిస్తున్నారు. అనంతరం బహిరంగ మార్కెట్ లో 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్​ఇచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దసరా, దీపావళికి దాదాపు రూ.300 కోట్లకు పైగా బిజినెస్​నడుస్తుందని అంచనా. 

ఇండ్ల మధ్యలోనే నిల్వ  

పండగల సందర్భంగా పటాకులకున్న డిమాండ్​దృష్ట్యా కొందరు కిరాణ షాపులు, సూపర్​మార్కెట్ల నిర్వాహకులు ఎలాంటి పర్మిషన్​తీసుకోకుండానే దందా చేస్తున్నారు. ఎలాంటి జనసంచారంలేని శివారు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను నిల్వ చేసి అమ్మాల్సి ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా జనం రద్దీగా ఉండే కాలనీల్లోనే టన్నుల కొద్దీ పటాకులను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ సిటీలోని బట్టల బజార్, బీట్​బజార్​ఏరియాల్లో ఇలాంటి షాపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

గతంలో ఇక్కడ రోడ్డు విశాలంగా ఉండి ఆర్వోబీ లేనప్పుడు పెట్రోలియం అండ్​ఎక్స్​ప్లోజివ్స్​సేఫ్టీ ఆర్గనైజేషన్​(పీసో) లైసెన్స్​లను తీసుకుని  ఆరుగురు ఫైర్​వర్క్స్​షాప్స్​నిర్వహించేవారు. ఆ తర్వాత ఎలాంటి పర్మిషన్లు లేకుండా పదుల సంఖ్యలో షాపులు పటాకుల బిజినెస్​చేస్తున్నాయి. అంతేకాకుండా జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్​వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇండ్ల మధ్యలోని ఫైర్ వర్క్స్​షాపుల్లో ఏదైనా అనుకోని ఘటన జరిగితే పెను ప్రమాదం సంభవిస్తుందనే భయాందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

లైట్​ తీసుకుంటున్న అధికారులు

ఫైర్​ క్రాకర్స్ ఇల్లీగల్​దందాతో  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా నిత్యం తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు లైట్​ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల మామూళ్లు తీసుకుంటూ కొందరు ఆఫీసర్లు ఇండ్ల మధ్య ఫైర్​క్రాకర్స్​డంపులు ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫైర్​సేఫ్టీ, పోలీస్​, రెవెన్యూ ఆఫీసర్లు తమకేం పట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీవల వరంగల్ టాస్క్​ ఫోర్స్​వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పటాలకును పట్టుకుంది. స్థానిక ఆఫీసర్లు లైట్​తీసుకోవడంతోనే ఇలా టాస్క్​ఫోర్స్​తనిఖీల్లో పటాకుల డంప్​లు వెలుగుచూస్తున్నాయనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి జనావాసాల్లో ఏర్పాటు చేస్తున్న ఫైర్​క్రాకర్స్​గోదాములను ఓపెన్​ ప్లేసులకు తరలించేలా చర్యలు చేపట్టాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.

భద్రకాళి' లాంటి ఘటన మరోసారి జరగొద్దంటూ..

 2018, జులై 4న వరంగల్ సిటీ శివారులోని కోటి లింగాల ఏరియాలోని భద్రకాళి ఫైర్​వర్క్స్​తయారీ కేంద్రంలో పేలుడు సంభవించగా.. అందులో పని చేసే15 మందిలో 8 మంది కార్మికులు స్పాట్​లో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిలో ఇంకో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగతా వాళ్లు అవయవాలు పోగొట్టుకొని జీవచ్ఛవంలా మిగిలారు. ఇది అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్​వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈనెల 4న హనుమకొండ జిల్లా పరకాల టౌన్ లో రూ.12.39 లక్షలు,  6న వరంగల్ జిల్లా పర్వతగిరిలో రూ.24.07 లక్షల విలువైన ఫైర్​క్రాకర్స్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా.. భద్రతా చర్యలు పాటించకుండా భారీగా నిల్వ చేసినట్టు బయటపడింది.’’ 

రెండు నెలల కింద జనగామ జిల్లా ఓబుల కేశవాపూర్​లో ఇల్లీగల్ గా ఫైర్ క్రాకర్స్ ను డంప్​చేయగా పోలీసులు దాడి చేసిస్వాధీనం చేసుకున్నారు. రూ.22.93 లక్షల విలువైన పటాకులను పట్టుకోగా..నిల్వ చేసిన గోదాముకు ఎలాంటి పర్మిషన్లు లేవని తేలింది.’’