ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీలో  భారీ పేలుడు..యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులోని ‘ప్రీమియర్‌‌‌‌‌‌‌‌’ కంపెనీలో ఘటన

  • ఓ కార్మికుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు
  • భోజనాల టైం కావడంతో తప్పిన భారీ ప్రాణనష్టం
  • ఏడు కిలోమీటర్ల వరకు సౌండ్‌‌‌‌‌‌‌‌, ఉలిక్కిపడ్డ  పరిసర గ్రామాల ప్రజలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ కార్మికుడు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... కంపెనీలోని పీఆర్డీసీ బిల్డింగ్‌‌‌‌ 3లోని వేమెంట్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో శనివారం ఉదయం కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు కార్మికులు ఎంవీటీ (మెగ్నీషియం, వైటాన్‌‌‌‌, టెఫ్లాన్‌‌‌‌) మిశ్రమాన్ని వేయింగ్‌‌‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9.45 గంటలకు పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కార్మికుడు మార్క కనకయ్య (54), యాదగిరిగుట్ట మండలం రామాజీపేటకు చెందిన మొగిలిపాక ప్రకాశ్‌‌‌‌, వంగపల్లికి చెందిన నర్సింహులు, వేణుగోపాల్‌‌‌‌ గాయపడ్డారు. వీరిని హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా కనకయ్య మార్గమధ్యలో చనిపోయాడు. ప్రకాశ్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని యశోద హాస్పిటల్‌‌‌‌కు తరలించగా, నర్సింహులు, వేణుగోపాల్‌‌‌‌ను భువనగిరిలోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వేర్వేరుగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

భోజనాల టైం కావడంతో తప్పిన భారీ ప్రాణనష్టం

పేలుడు కొన్ని నిమిషాల ముందుగనక జరిగి ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది. పేలుడు జరిగిన పీఆర్డీసీ బిల్డింగ్‌‌‌‌3లో పనిచేసేందుకు ఉదయం 6 గంటలకు ఫస్ట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌లో 16 మంది కార్మికులు వచ్చారు. ఫస్ట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌లో డ్యూటీ ఎక్కిన కార్మికులకు 10 గంటలకు భోజనాల టైం ఉంది. దీంతో 12 మంది కార్మికులు 9.30 గంటలకే బయటకు రాగా మిగతా నలుగురు బిల్డింగ్‌‌‌‌లోనే పనిచేస్తున్నారు. ఈ టైంలో ప్రమాదం జరగడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. అదే భోజనాల టైం కాకుంటే కార్మికులంతా బిల్డింగ్‌‌‌‌లోనే ఉండేవారని, దీని వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేదని కార్మికులు భయాందోళన వ్యక్తం చేశారు. 

గ్యాస్‌‌‌‌ ఎనర్జీ కారణం

పీఆర్డీసీ బిల్డింగ్‌‌‌‌లో గ్యాస్‌‌‌‌ ఎనర్జీ కారణంగానే పేలుడు, భారీ సౌండ్‌‌‌‌ సంభవించిందని డైరెక్టర్‌‌‌‌ దుర్గాప్రసాద్‌‌‌‌ తెలిపారు. ప్రమాదస్థలంలో బర్నింగ్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ ఉండొచ్చన్న అనుమానంతో ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. వేమెంట్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో పేలుడు కారణంగా ఎగిసిన మంటలు మిగతా సెక్షన్లకు వ్యాపించడంతో మరో రెండు సార్లు బ్లాస్ట్‌‌‌‌ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

50 మందికి మెడికల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు

పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కొందరు కార్మికుల్లో వినికిడి, తలనొప్పికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. దీంతో యాజమాన్యం 50 మంది కార్మికులకు వైద్య పరీక్షలు చేయించారు. పేలుడు కారణంగా వెలువడిన శబ్దం సుమారు ఏడు కిలోమీటర్ల వరకు వినిపించిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలిపారు. కంపెనీలో పెద్దకందుకూరు గ్రామస్తులే ఎక్కువగా పనిచేస్తుండడంతో గ్రామస్తులు, కార్మికుల కుటుంబ సభ్యులు హుటాహుటిన కంపెనీ వద్దకు పరుగులు తీశారు. 

స్టోర్‌‌‌‌ రూమ్‌‌‌‌లో భద్రపరిచే క్రమంలో పేలుడు ?

ప్రీమియర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ కంపెనీలో  డిటోనేటర్లు, ఫ్యూజ్‌‌‌‌లతో పాటు డిఫెన్స్‌‌‌‌ కోసం బీకేఎన్‌‌‌‌వో 3ని తయారు చేస్తున్నారు. బీకేఎన్‌‌‌‌వో 3 తయారీలో మెగ్నీషియంతో పాటు గన్‌‌‌‌పౌడర్‌‌‌‌, ఇతర పదార్థాలు మిక్స్‌‌‌‌ చేస్తారు. ఇలా మిక్స్‌‌‌‌ అయిన తర్వాత ఆ పౌడర్‌‌‌‌ను ఒత్తిడికి గురి చేయడంతో క్యారం బోర్డ్‌‌‌‌ కాయిన్‌‌‌‌ సైజులో ట్యాబ్లెట్లు తయారవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం మెషీన్ల ద్వారానే జరుగుతుందని, ఆ టైంలో కార్మికులు ఎవరూ అక్కడ ఉండరని తెలుస్తోంది. ఇలా తయారైన ట్యాబ్లెట్లను కార్మికులు సేకరించి స్టోర్‌‌‌‌రూంలో భద్రపరుస్తారు.

ఈ క్రమంలోనే కనకయ్య స్టోర్‌‌‌‌రూంలోకి వెళ్లిన తర్వాత బీకేఎన్‌‌‌‌వో 3 కింద పడి పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలోనే మూడుసార్లు పేలుడు జరిగిందని సమాచారం. కనకయ్య అక్కడికక్కడే చనిపోయి ఉంటాడని, ఈ విషయం కార్మికులకు చెబితే నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే కంపెనీ ప్రతినిధులు దాచినట్లు ప్రచారం జరుగుతోంది.

కంపెనీపై చర్యలు తీసుకుంటాం 

కార్మికుడి మృతికి కారణమైన ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం భువనగిరిలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికుల రక్షణకు చర్యలు చేపట్టాలని ఎన్ని సార్లు చెప్పినా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వైరీ చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రూ. 60 లక్షల పరిహారం, భార్యకు ఉద్యోగం

పేలుడులో చనిపోయిన కనకయ్య ఫ్యామిలీని అదుకునేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. మృతుడి ఫ్యామిలీకి పరిహారం కింద రూ. 60 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుందని కార్మిక సంఘాల లీడర్లు చెప్పారు. అలాగే కనకయ్య ప్రస్తుతం తీసుకుంటున్న జీతంతోనే ఆయన భార్యకు ఉద్యోగం ఇచ్చేందుకు సైతం అంగీకరించారని తెలిపారు.

మూడు ప్రమాదాల్లో నలుగురు మృతి

ప్రీమియర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ కంపెనీ ఏర్పాటై 35 ఏండ్లు అవుతోంది. కంపెనీ చరిత్రలో మూడు బ్లాస్టింగ్‌‌‌‌లు జరుగగా నలుగురు కార్మికులు చనిపోయారు. 2012లో జరిగిన పేలుడులో ఆలేరుకు చెందిన మొయినొద్దీన్, ఎల్లయ్య చనిపోగా, 2019లో పెద్ద కందుకూరుకు చెందిన జైపాల్‌‌‌‌ చనిపోయాడు. తాజాగా జరిగిన ప్రమాదంలో కనకయ్య మృతి చెందారు.