ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం

తుపాకుల మోతతో ఛత్తీస్‎గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్ట్‎లు హతం కాగా కొందరు జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని లావా పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలు ఎదురు పడగా.. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఫైరింగ్‎లో 10 మావోయస్టులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా, ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా స్థానిక బీజేపీ ప్రభుత్వం పని చేస్తోంది. గడచిన నాలుగు నెలల్లో జరిగిన ఎన్ కౌంటర్లే ఇందుకు నిదర్శనం. చివరి నాలుగు నెలల్లో దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్లో దాదాపు 150 మందిపైకి మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్  షా ఇటీవలే ఛత్తీస్ గఢ్ లో పర్యటించి.. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. అమిత్ షా ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.