రైతులు ఆందోళన చెందొద్దు : మార గంగారెడ్డి

నందిపేట, వెలుగు :  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించే క్రమంలో తొందరపడి తక్కువ ధరకు విక్రయించొద్దని, అన్ని పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మార్క్​ఫెడ్​ చైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. బుధవారం డొంకేశ్వర్​ పీఏసీఎస్​ ఆవరణలో సోయాబీన్​ కొనుగోలు కేంద్రం ప్రారంభం, గిరి ఆవుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోయా బీన్​ పంటను ఎకరానికి 6.5 క్వింటాళ్లే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ

మంత్రిని కలిసి ఎకరాకు తొమ్మిది క్విటాంళ్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.  రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వస్తుందని, అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని కోరారు. మార్కెట్​లో  సోయా, వరి పంటలకు మద్దతు ధరకన్నా తక్కువ ధర వస్తున్నప్పుడు మార్క్​ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు  సిద్ధంగా ఉన్నామన్నారు.  సొసైటీలో సభ్యత్వం ఉన్న  మహిళలకు 20 దేశవాళి ఆవులు, 18 మంది మహిళలకు కుట్టుమిషన్ల ను పంపిణీ చేశారు. 

తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి సహకరించాలన్నారు. సొసైటీలో సభ్యత్వం కలిగిన వారికి గోవులను అందజేయడం అభినందనీయమని, జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం చేపడితే గో సంపద వృద్ధి చెందుతుందన్నారు. చైర్మన్​ భరత్​రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు. మంగిరాములు మహారాజ్​ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులతో పాటు హిందూధర్మ పరిరక్షణ కొరకు దేశవాళి ఆవుల పెంపకం చాలా అవసరమన్నారు.​   కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్ ​రాధ, డైరెక్టర్లు పాల్గొన్నారు.