పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు

అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టాల పాలైన రైతులకు.. బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ డిమాండ్. పత్తి, మిర్చి, వరి పంటలు వేసి విసిగిపోయిన రైతులు.. ఇప్పుడు బంతిపూలు సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  

 ఖమ్మం జిల్లాలో అధికశాతం సారవంతమైన భూములున్నాయి. సాగర్ నీళ్లు, బావులు, చెరువులు, వర్షాలపై ఆధారపడి అనేక రకాల పంటలు వేస్తున్నారు రైతులు. కానీ ప్రకృతి వైపరీత్యాలతో చేతికొచ్చిన పంట నోటివరకు రాలేని పరిస్థితి. సర్కార్ నుంచి వచ్చే సబ్సిడీలు అంతంతమాత్రమే. కొన్నిసార్లు పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నారు రైతులు. అధిక పెట్టుబడి పంటలు వేసి నష్టపోయిన రైతులు.. ఇప్పుడు తక్కువ ఖర్చుతో సాగయ్యే డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పూలసాగు వైపు మళ్లుతున్నారు.

 సీజన్ తో సంబంధం లేకుండా.. నిత్యం అందరు ఉపయోగించే బంతిపూల సాగుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఖమ్మం రైతులు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 వందల ఎకరాల్లో బంతిపూలు సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎల్లో, ఆరెంజ్ కలర్ బంతిపూల నారు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. మొన్న కార్తీక మాసంలో పూల అమ్మకాలు జోరుగా సాగాయని తెలిపారు బంతిపూల రైతులు. ఇప్పుడు అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో పడిపూజ, ఇతర పూజలకు పూలు ఎక్కువగా కొంటున్నారని  చెప్పారు.

 ఖమ్మంలో స్థానికంగా బంతిపూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని చెప్పారు రైతులు. విజయవాడ, ఖమ్మం మార్కెట్లకు పూలు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఏపీ నుంచి కొందరు వ్యాపారులు నేరుగా తోటలకు వెళ్లి బంతిపూలు కొంటున్నారు. 

ALSO READ : భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్

 మిగతా వాణిజ్య పంటలతో పోలిస్తే.. బంతి సాగు లాభదాయకంగా ఉందన్నారు రైతులు. ఒకరిని చూసి మరొకరు.. ఇలా ఎక్కువమంది రైతులు బంతి తోటలు వేస్తున్నారు. పూజలతో పాటు పెళ్లిళ్ల సీజన్ లో పూల అమ్మకం ఎక్కువగా ఉందని.. కస్టమర్లు నేరుగా తోటకు వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పారు రైతులు. ఇలా తమకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయని తెలిపారు. పత్తి, మిర్చి, తదితర పంటలు వేసి నష్టపోయిన తమకు..బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుందని తెలిపారు రైతులు.