ఛత్తీస్ గఢ్-తెలంగాణ బార్డర్‌లోని జీడిపల్లి భద్రతా దళాల బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మావోయిస్టులకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో 2024 డిసెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి నుంచి భద్రతా దళాలకు, మావోయిస్టులకు భీకరంగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా రెండు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లిలో భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి.
ఈ క్యాంప్‌పై పోలీసులు మెరుపు దాడికి దిగారు. మావోయిస్టుల ఎటాక్ నేపథ్యంలో సంఘటనా స్థలానికి సీఆర్‌పీఎఫ్ డీఐజీ సూరజ్‌పాల్ వర్మ, సీఆర్‌పీఎఫ్ 228వ బెటాలియన్ కమాండెంట్ లతీఫ్ కుమార్ సాహు, పలువురు పోలీసు అధికారులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టుల నుంచి నిరంతరాయంగా కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు.
మావోయిస్టుల కాల్పులకు ధీటుగా సైనికులు సమాధానమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన స్థలంలో ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని వాజేడులో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. ఈ ఎన్ కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు తాజాగా పోలీసుల క్యాంప్‌పై మెరుపు దాడికి దిగినట్లు తెలుస్తోంది.