మావోయిస్టు​ మల్లయ్య అంత్యక్రియలు పూర్తి

గోదావరిఖని, వెలుగు:  ఏటూరు నాగారం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన మావోయిస్టు​లీడర్​ వేగోలపు మల్లయ్య అలియాస్​ మధు(47) అంత్యక్రియలు శనివారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్​ గ్రామంలో నిర్వహించారు. మల్లయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు రాణాపూర్​తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మల్లయ్య డెడ్​బాడీతో అంతిమయాత్ర నిర్వహించగా, కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల లీడర్లు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఎర్ర జెండాలు పట్టుకొని, విప్లవ పాటలు పాడుతూ పాల్గొన్నారు.

గ్రామ శివారులోని స్మశాన వాటికలో అంత్రక్రియలు పూర్తి చేశారు. మల్లయ్య భార్య మీనా, సోదరులు రాజయ్య, సతీశ్, శ్రీనివాస్​, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మకుమారి పాల్గొన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్  ప్రభుత్వం బాధ్యత వహించాలని,  ఇలాంటి మారణకాండను కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఆపాలని, శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరారు.