- చత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని డబ్బికొంట, ఎంటపాడు, బుర్కలంక, పాములూరు, సింగనమడుగు గ్రామ అడవుల్లో రెండు రోజుల నుంచి డీఆర్ జీ, బస్తర్ ఫైటర్స్, 206,208 బెటాలియన్లకు చెందిన కోబ్రా, 131 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
పాములూరు గుట్టల్లో కూంబింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురు పడగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు పారిపోగా సంఘటనా స్థలంలో కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు లోకేశ్ మృతదేహం దొరికింది. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.
ఇన్ఫార్మర్ పేరుతో గిరిజనుడి హత్య చేసిన మావోయిస్టులు
ఇన్ఫార్మర్ పేరుతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్ లో జరిగింది. బీజాపూర్జిల్లాలోని భూపాల్పట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని పోశనపల్లిలో గిరిజనుడు తాటి కన్నయ్యతో మాట్లాడేది ఉందంటూ మంగళవారం అతడిని ఇంట్లోంచి సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు.
అక్కడ ప్రజాకోర్టు పెట్టి 15 ఏండ్లుగా పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడంటూ అభియోగం మోపారు. దళాల సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడంటూ ఒప్పించారు. అనంతరం దారుణంగా కొట్టి, కత్తులతో పొడిచి హత్య చేశారు. మావోయిస్టుల పేరుతో తాటి కన్నయ్య ఇన్ఫార్మర్గా పని చేస్తున్నా డంటూ లేఖను సంఘటనా స్థలంలో వదిలి వెళ్లారు.