పార్టీ లీడర్లతో కమ్యూనికేషన్ .. హై–క్వాలిటీ కంటెంట్

ఎమ్మెల్యే క్యాండిడేట్లలో చాలామంది ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి నియోజకవర్గ పార్టీ లీడర్లతో కమ్యూనికేషన్ పెంచుకునేందుకు ఖర్చు పెడుతుంటారు. మండలాల వారీగా మీటింగ్‌‌లు పెట్టి బలం, బలహీనతలు తెలుసుకుంటారు. నాయకులను పెద్ద హోటల్స్‌‌కి పిలిపించి పార్టీలు ఇచ్చి, వాళ్ల అవసరాలు తీర్చి లోకల్‌‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే.. ఇలా కమ్యూనికేషన్‌‌ పెంచుకోవడం వల్ల ఎలక్షన్స్‌‌ ముగిసే వరకు ఏ ఊరిలో చీమ చిటుక్కుమన్నా అభ్యర్థులకు తెలిసిపోతుంది. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కూడా ఆ లీడర్లకు గిఫ్ట్‌‌లు ఇస్తుంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఓటర్లకు ఏ అంశాలను చెప్పాలి? ఏ అంశాలను కప్పిపుచ్చాలి? అనే విషయాలు ఆ అభ్యర్ధులకు తెలుస్తాయి. 

హై–క్వాలిటీ కంటెంట్

ఈ మధ్య అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు, సభలు పెట్టినప్పుడు తీసిన వీడియోలు సోషల్​ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం.. ఆ వీడియోలు మాత్రమే కాదు. వాటి గ్రాఫిక్‌‌ డిజైనింగ్‌‌ కూడా. ఆ వీడియో కంటెంట్‌‌ని అందంగా మార్చేందుకు చాలామంది లీడర్లు సెపరేట్‌‌గా ఒక టీమ్‌‌ మెయింటెయిన్​ చేస్తున్నారు. ఆ టీం సభ్యుల్లో కొందరు ప్రచారంలో అభ్యర్థి వెంటే ఉంటూ హై క్వాలిటీ వీడియోలు, ఫొటోలు తీసి, ఎప్పటికప్పుడు ఆఫీస్‌‌కి పంపుతుంటారు.

ఆఫీస్‌‌లో ఉండే వీడియో ఎడిటర్లు వాటికి మంచి బ్యాక్​గ్రౌండ్‌‌ మ్యూజిక్ లేదా ఆ అభ్యర్ధి మీద ఉన్న పాటను కలిపి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేస్తుంటారు. ఇదంతా చేయడానికి ఒక్కో లీడర్‌‌‌‌ దగ్గర ఐదు నుంచి పది మంది వరకు పనిచేస్తుంటారు. ఫొటోగ్రాఫర్‌‌‌‌కు 30 వేలు, వీడియో గ్రాఫర్​‌‌కు 50 వేల రూపాయల వరకు ఇస్తున్నారు. వీడియో ఎడిటర్లకు కూడా బాగానే డబ్బులు ముడుతున్నాయి. నాయకుల అభిమానులు, ఫాలోవర్లు వాట్సాప్​ స్టేటస్‌‌లు పెట్టుకునేందుకు, ఇన్‌‌స్టాలో రీల్స్‌‌ పోస్ట్‌‌ చేసేందుకు, ఫేస్‌‌బుక్‌‌ పోస్ట్‌‌ల కోసం కూడా కంటెంట్‌‌ని క్రియేట్‌‌ చేస్తుంటారు.

అందుకోసం ప్రత్యేకంగా కొందరు కంటెంట్‌‌ క్రియేటర్లను ఈ టీంలో చేర్చుకుంటారు. వీళ్లు ఫొటోలకు మంచి క్యాప్షన్స్ రాయడం, కొటేషన్స్ రాయడం లాంటివి చేస్తుంటారు. ఈ పనులతో పాటు మీడియా హౌస్​లకు వీడియోలు, ఫొటోలు పంపుతుంటారు.   

లైవ్‌‌ స్ట్రీమింగ్‌‌: కొందరు నాయకులైతే ఏకంగా లైవ్‌‌ స్ట్రీమింగ్‌‌ సెటప్‌‌ని కూడా పెట్టుకుంటారు. అందుకోసం హై క్వాలిటీ కెమెరాలతోపాటు లైవ్ స్ట్రీమింగ్‌‌ కోసం పూర్తి సెటప్‌‌ని కొంటారు. వాళ్లు ఎక్కడ సభ పెట్టినా, ప్రచారానికి వెళ్లినా వీడియా రికార్డ్‌‌ చేస్తూ.. దాని స్ట్రీమింగ్‌‌ లింక్‌‌ క్రియేట్‌‌ చేసి న్యూస్‌‌ ఛానెళ్లు, యూట్యూబ్‌‌ ఛానెళ్లకు పంపుతుంటారు. దీని కోసం కొన్ని లక్షలు ఖర్చు చేస్తుంటారు.