అవేర్ నెస్ : ఈ పాజిటివిటీ వద్దు!

టాక్సిక్ పాజిటివిటీ... అంటే కేవలం పాజిటివ్​ ఎమోషన్స్​ను మాత్రమే వ్యక్తం చేయడం. నెగెటివ్​ ఎమోషన్స్​, ఫీలింగ్స్​, రియాక్షన్స్​ లేదా ఎక్స్​పీరియెన్స్​లను అణచివేయడం. ఇలా చేయడం వల్ల మనుషుల్లో ఒంటరితనం, మానసిక అనారోగ్యం వస్తుంది. మరి దీని బారినపడకుండా ఉండడం ఎలా? 

పాజిటివ్​ థింకింగ్​... అంటే సానుకూల ఆలోచన. దీనికి చాలా శక్తి ఉంది అనేందుకు చాలానే ఆధారాలు ఉన్నాయి. నిజానికి విషయాలను సానుకూలంగా చూడడంలో తప్పులేదు. అలాగని ఎటువంటి సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సానుకూలంగా ఉంటే మాత్రం సానుకూలం అనే విషవలయంలో ఇరుక్కుపోయినట్టే. దీన్నే టాక్సిక్ పాజిటివిటీ అంటారు. బుర్రలోకి నెగెటివ్​ ఎమోషన్స్​ అంటే ప్రతికూల భావోద్వేగాలు రాకుండా చేసి, ఎప్పుడూ పాజిటివ్​ థింకింగ్​తో ఉండడం వల్ల అన్ని రకాల సమస్యలు తీరిపోతాయనే నమ్మకం ఉంది.

కానీ అది చాలా ప్రమాదకరం అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఈ టాక్సిక్​ పాజిటివిటీ ప్రమాదకరం అనేందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నారని అనిపించినప్పుడు వీలైనంత త్వరగా దాన్నుంచి బయటపడాలని హెచ్చరిస్తున్నారు కూడా. అందుకు వాళ్లు కొన్ని టిప్స్​ కూడా చెప్పారు.

సమస్యలకు ‘సానుకూలం’ కాదు

పాజిటివ్​గా ఆలోచించడం అనేది మంచిదని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే మీడియాలో కూడా పాజిటివ్​ థింకింగ్​ వల్ల మానసిక ఆరోగ్యలాభాలు ఎన్నో అని దశాబ్దాలుగా చెప్తూనే ఉన్నారు. అలాగని పాజిటివ్​ థింకింగ్​ అనేది శూన్యంలోంచి పుట్టదు. సామాజిక మద్దతు, సమస్యలకు తట్టుకునే సామర్ధ్యం వంటివి ఆ వ్యక్తి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. ఇందులో అందుకు కారణమవుతున్న ఇతర విషయాలను గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఏదెలా ఉన్నా టాక్సిక్ పాజిటివిటీ మాత్రం చాలా ప్రమాదం. దీనికి కారణం... సానుకూల ఆలోచన అనేది అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం అనే నమ్మకమే అంటున్నారు నిపుణులు..

టాక్సిక్​ పాజిటివిటీ అనేది వ్యక్తిలోని ప్రతికూల భావోద్వేగాలను వ్యక్తంచేయొద్దని డిమాండ్​ చేస్తుంది. దానివల్ల మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ల మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇందుకు ఉదాహరణ... పిల్లల్ని కోల్పోయిన వాళ్ల దగ్గరకు వెళ్లి ‘‘కనీసం మీరు పిల్లల్ని కనగలిగే స్థితిలో ఉన్నారని’’ అనడం లేదా ఆందోళనలో ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లి ‘‘పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉండొచ్చు” అని చెప్పడం. ఇలాంటి సందర్భాల్లో పాజిటివ్​గా ఆలోచించమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్​?

వాళ్లు స్ట్రాంగ్​ కాదు

ఎప్పుడూ పాజిటివ్​గా కనిపించే వాళ్లు లేదా నెగెటివ్​ ఎమోషన్స్​ను బయటకు చెప్పని వాళ్లను స్ట్రాంగ్​గా ఉన్నారు అనుకుంటారు. ఇలాంటి లేబులింగ్ ఏమాత్రం పనికి రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. విషయాల గురించి సానుకూలంగా ఉండడం ప్రమాదకరం కాదు. కానీ టాక్సిక్​ పాజిటివిటీతో ఉండడం మంచిది కాదు. 
ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వాళ్ల దగ్గర ‘పోయిన వాళ్లతో మనం పోలేం కదా... మూవ్​ 
ఆన్​’ అని చెప్తే చనిపోయిన వ్యక్తి ఇంపార్టెంట్​ కాదనే అర్థం వస్తుంది. ఇది అవతలి వాళ్ల విచారాన్ని ఇంకా పెంచుతుంది. అందుకని ఏ సందర్భంలో పాజిటివ్​గా ఉండాలి, ఏ సందర్భంలో ఉండకూడదు అనేది తెలుసుకుని ప్రవర్తించాలి.

ఒత్తిడి వల్ల...

ఇతరుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాళ్లు వాళ్లలోని ప్రతికూల భావోద్వేగాలను బయటకు చెప్పలేరు. అలాగే సాయం అడిగేందుకు కూడా ఇష్టపడరు. దాంతో ఒంటరి అనే భావనలోకి వెళ్తారు. తమలోని భావోద్వేగాలను బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడతారు.

మరీ ముఖ్యంగా రిలేషన్​షిప్స్​లో టాక్సిక్​ పాజిటివిటీ అనేది ఆ జంట సమస్యలను పట్టించుకోకుండా చేస్తుంది. ప్రతి దానిలో పాజిటివ్​ అనే అంశాన్ని మాత్రమే చూసేలా చేస్తుంది. ఈ పరిస్థితి ఆ ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్​కు, సమస్యలను పరిష్కరించుకునే సామర్ధ్యానికి హానికరం అన్నట్టు తయారవుతుంది. అందుకే విషయాలను సానుకూలంగా చూడాలనే ఒత్తిడి  ఉన్నా లేదా అన్నిసార్లు సానుకూలంగా చూస్తున్నా... అది పనిచేయనప్పుడు ‘నేను ఫెయిల్యూర్​’ అనే ఫీలింగ్​ వస్తుంది.

నెగెటివ్​ ఎమోషన్స్​ ఓకే

ప్రతికూల భావోద్వేగాలు​ అనేవి మనసుకు హాయిగా అనిపించని మాట వాస్తవం. కానీ ఏదో ఒక కారణం వల్ల అవి వస్తుంటాయి. నిజానికి ఆందోళన లేదా భయం వంటి నెగెటివ్​ ఎమోషన్స్​ మనకి హాని కలగకుండా కాపాడతాయి. అలాంటి ఈ ఎమోషన్స్​ను పట్టించుకోకుండా ఉండడం లేదా అణచివేయడం వల్ల అవి మనసులోనుంచి మాయమైపోవు. అందుకే అలాచేయకుండా ఆ ఎమోషన్స్​ గురించి బయటకి మాట్లాడడం వల్ల అవి వాటి ఎనర్జీ కోల్పోతాయి. 

2020లో గృహహింస మీద ఒక స్టడీ జరిగింది. అందులో అబ్యూజివ్ రిలేషన్​లో ఉన్నవాళ్లకు పాజిటివ్​ బయాస్​ ధోరణి ఉంటే... తాము ఎదుర్కొంటున్న హింస తీవ్రతను వాళ్లు తక్కువగా అంచనా వేసే ప్రమాదం ఉందని తేలింది. 

టాక్సిక్​ పాజిటివిటీ ప్రభావం ఇతరుల మీద పడకుండా ఏం చేయాలో చూద్దాం. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.

  • సానుకూలమా, ప్రతికూలమా అనే విషయం పక్కన పెట్టి ఎదుటి వాళ్ల భావోద్వేగాల గురించి మాట్లాడేలా ప్రోత్సహించాలి.

  •  ప్రతికూల భావోద్వేగాలు అయినప్పటికీ ఇబ్బంది పడకుండా వినాలి.  ఇదెప్పుడు కుదురుతుందంటే అవతలి వాళ్ల మాటలు వినే ఓపిక ఉన్నప్పుడు. అలా కుదరడం లేదంటే మీలోని ప్రతికూల భావోద్వేగాలతో టచ్​లో ఉండొచ్చు. అందుకు పైన చెప్పిన టెక్నిక్స్​ ఫాలో కావాలి.
  •  ఇతరుల మీద టాక్సిక్​ పాజిటివిటీని రుద్దకుండా ఉండాలంటే... ఇతరులు చెప్పే ప్రతి విషయానికి పాజిటివ్​ రెస్పాన్స్​ ఇవ్వాలి అనుకోవద్దు.
  •  ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వాళ్లలోని నెగెటివ్​ ఎమోషన్స్​ గురించి మాట్లాడితే... వాళ్ల మాటలకు సానుకూలంగా స్పందించి, వాళ్లలోని ఆలోచనలు ఎలాగైనా తీసేయాలి అనుకోవద్దు.
  •  తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలు... దుఃఖం, ప్రేమ వంటి తీవ్రమైన సానుకూల భావోద్వేగాలతో సమానం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

టాక్సిక్​ పాజిటివిటీ నుండి బయటపడేందుకు కొన్ని టిప్స్​ ఉన్నాయి. అవేంటంటే...

ఎటువంటి పరిస్థితుల్లో అయినా సానుకూలంగానే ఉండాలనే ఒత్తిడి ఇతరుల నుంచి కాకుండా మన మీద మనకే ఉన్నప్పుడు టాక్సిక్​ పాజిటివిటీలో ఉన్నట్టు. దీన్నుంచి బయటపడాలంటే... సానుకూల, ప్రతికూల భావోద్వేగాలన్నీ మన జీవితంలో సహజమే అని గుర్తించడం మొదటి అడుగు.

 

  • ప్రతికూల భావోద్వేగాలు సహజమే అనేది అర్థమయ్యాక... వాటి గురించి ఆలోచించకుండా ఉండడం లేదా పట్టించుకోకుండా ఉండడం అనే విషయం గురించి ఆలోచించాలి.
  • నెగెటివ్​ ఎమోషన్స్​ గుర్తించాలి. వాటికో పేరు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఎమోషన్​ గురించి బయటకు మాట్లాడగలుగుతారు. అలా మీకు, ఆ ఎమోషన్​కు మధ్య దూరం మెయింటెయిన్​ చేయొచ్చు.
  • భావోద్వేగాల గురించి ఇతరులతో మాట్లాడడం అనేది ముఖ్యం. అవి​ సానుకూలమా, ప్రతి కూలమా అనేది తరువాతి విషయం. 
  • భావోద్వేగాల గురించి ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్లు నమ్మకమైన వ్యక్తులు అయి ఉండాలి. లేదంటే వాళ్లతో ఓపెన్​గా మాట్లాడలేరు. వాళ్లు నాన్​ జడ్జిమెంటల్​గా ఉండే వాళ్లు అయి ఉండాలి. అలాంటివాళ్లు నమ్మకమైన స్నేహితులు లేదా థెరపిస్ట్​ కావచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే... ఎటువంటి జంకు లేకుండా వాళ్ల ఎదురుగా భావోద్వేగాలను చెప్పగలరా? లేదా?