అత్యవసర వైద్యం.. నర్సులపైనే భారం! 

  • 24 గంటలు ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ దందా  
  • రాత్రిపూట దవాఖానకు పోతే అందుబాటులో ఉండని స్పెషలిస్టులు 
  • రెసిడెంట్ డాక్టర్స్, నర్సులు, కాంపౌండర్స్​తో ట్రీట్​మెంట్
  • పొద్దున 10 గంటల దాకా పేషెంట్లను చూసే దిక్కు లేదు  
  • డాక్టర్ల వాట్సాప్ వైద్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు 

మంచిర్యాల, వెలుగు: నిజమే అనుకొని దవాఖానకు పోతే అక్కడ స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉండరు. రాత్రిపూట ఏదైనా ఆపదొచ్చి వెళ్తే అంతే సంగతులు. చాలా హాస్పిటళ్లలో బోర్డుపై  రాసినట్టు అత్యవసర వైద్యసేవలు అందడం లేదు.

హడావుడిగా పేషెంట్లను అడ్మిషన్ చేసుకొని ఫోన్​లో డాక్టర్లకు సమాచారం ఇవ్వడం, వారు వాట్సాప్​లో మందులు సూచిస్తుండడంతో.. కాంపౌండర్లు, నర్సులు ట్రీట్​మెంట్ చేస్తున్నారు. పొద్దున 9, 10 గంటలకు 
డాక్టర్లు వచ్చేదాకా పేషెంట్ల ప్రాణాలకు భరోసా లేకుండాపోతోంది.  

గోల్డెన్ టైమ్ గోవిందా..

పాయిజన్, యాక్సిడెంట్, హార్ట్ స్ట్రోక్ వంటి పరిస్థితుల్లో స్పెషలిస్టు డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ వారు అందుబాటులో ఉండక కాంపౌండర్లు, నర్సులతో వాట్సాప్ వైద్యం అందిస్తున్నారని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. ఇక్కడ డాక్టర్లు లేకపోతే చెప్పండి కరీంనగర్​కో, హైదరాబాద్​కో పోతామంటే ‘సార్ వస్తున్నారు’, ‘పేషెంట్ కండీషన్ సీరియస్’ అంటూ కదలని వ్వడం లేదు. పొద్దున డాక్టర్లు వచ్చేదాకా వీళ్లు రిపోర్టులు పంపడం, వాళ్లు మందులు సూచించడం అంతా వాట్సాప్​లోనే నడుస్తోంది. పైన పేర్కొన్నటువంటి ఎమర్జెన్సీ కేసుల్లో గోల్డెన్ హవర్ ఎంతో కీలకమని చెపుతారు.

కానీ ఆ టైమ్ గడిచినా డాక్టర్లు వచ్చి పేషెంట్లను చూడడం లేదు. ఇక్కడ టైమ్ వేస్ట్ చేసే బదులు అంబులెన్స్​లో గంటలో కరీంనగర్​కు, మూడు గంటల్లో హైదరాబాద్​కు చేరుకునే చాన్స్ ఉన్నా ‘మీ ఓన్ రిస్క్’ అంటూ పేషెంట్ బంధువు లను బెంబేలెత్తిస్తున్నారు. తీరా రెండు, మూడు రోజులు ఉంచుకొని ‘సారీ.. మేం చాలా ట్రై చేశాం’ అని చేతులెత్తేస్తున్నారు.  

కార్డియాలజిస్ట్ రాలే.. 

మా నాన్నను ‘టచ్’ చేయలే..  

‘మాది మందమర్రి థర్డ్ జోన్. ఇటీవల మా నాన్న తిరుపతికి మెడ నరాలు గుంజడం, గుండె దడ రావడంతో రాత్రి 11 గంటలకు మంచిర్యాల జన్మభూమినగర్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లినం. డ్యూటీ డాక్టర్ చెక్ చేసి బీపీ 190/200, హార్ట్ రేట్ 180 ఉందన్నడు. ఆ టైమ్​లో కార్డియాలజిస్ట్ లేడు. కరీంనగర్ వెళ్తామంటే ‘మీ ఓన్ రిస్క్’ అని భయపెట్టిన్రు. 11.30కు డాక్టర్ వస్తారని చెప్పి ఐసీయూకి షిష్ట్ చేసిన్రు. తెల్లారి 8గంటలకు నాన్నకు స్ట్రోక్ వచ్చింది. సీపీఆర్ చేసిన్రు.

ఆ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టిన్రు. 10 గంటలకు డాక్టర్ వచ్చి చూసిండు. యూరిన్ బంద్ కావడంతో మరుసటి రోజు వేరే హాస్పిటల్​లో డయాలసిస్ చేసిన్రు. మళ్లీ డయాలసిస్, యాంజియోగ్రామ్ చేస్తమని చేయలే. రెండో రోజు డాక్టర్ వచ్చి పేషెంట్ జల్ది రికవరీ అయితడని చెప్పిండు. ఇగ నాన్నకు ఏం కాదనుకున్నం. కానీ నాలుగో రోజు రాత్రి 11 గంటలకు చనిపోయిండని చెప్పిన్రు.

నాన్నను తీసుకొచ్చిన రోజు ఐసీయూలో ఓ పేషెంట్ చనిపోయిండు. బెడ్ చుట్టూ కనీసం కర్టెన్స్ కూడా వేయకుంటనే డెడ్​బాడీని ప్యాక్ చేసిన్రు. అది చూసి పేషెంట్లు టెన్షన్ పడ్డరు. మా నాన్నను ఇక్కడ అడ్మిట్ చేయకుండా కరీంనగర్ తీసుకెళ్తే ఈ పరిస్థితి రాకపోవును’ అంటూ కొడుకు శేఖర్ కంటతడి పెట్టుకున్నాడు. తన తండ్రికి సరైన ట్రీట్​మెంట్ అందకపోవడం వల్లే చనిపోయాడని, కేస్ షీట్ అడిగితే ఇవ్వడం లేదని చెప్పాడు. ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ ఏ తీరుగా అందుతున్నదో దీన్నిబట్టి అర్థం
 చేసుకోవచ్చు.