రిలేషన్ : మనం మనలాగే ఉంటున్నామా.. పక్కనోళ్లు చెప్పింది వింటున్నామా..!

ప్రేమంటే... మిక్స్ డ్ ఎమోషన్, కోపతాపాలు, గిల్లిగజ్జాలు, అలకలు, సంతోషాలు.. అన్నీ ఉంటాయి ఇందులో. కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొందరు ప్రేమించిన వాళ్లకోసం తమని తాము మార్చుకుంటుంటారు. మరికొందరేమో పార్టనర్ ని తమకి నచ్చినట్టుగా నడుచుకోమని ఒత్తిడి చేస్తుంటారు. మరి ఇది ప్రేమేనా? అని అడిగితే కచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే మనం మనలా లేనప్పుడు... మనల్ని మనమే కోల్పోతున్నప్పుడు ఇంకొకరిని మనసారా ఎలా ప్రేమించగలం.

చాలామంది రిలేషన్ లో పార్ట్ నర్ కి నచ్చేలా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. డ్రెస్సింగ్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింట్లో వాళ్లకి ఎలా ఉంటే ఇష్టమో అలా నడుచుకుంటుంటారు. ఇదంతా పార్టనర్ హ్యాపీనెస్ కోసమే చేసినప్పటికీ.. వీటన్నింట్లో మనం ఎంతవరకు కంఫర్ట్ గా ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. అవి ఎంత వరకు సంతోషాన్ని ఇస్తున్నాయన్నది చెక్ చేసుకోవాలి. 

ఎందుకంటే .. మొదట్లో పార్టనర్ ని ఇంప్రెస్ చేయడా నికి ఇవన్నీ బాగానే అనిపించినా.. లాంగ్ టర్మ్ మనల్ని మనకి దూరం చేస్తాయి. మన రిలేషన్లో మన స్థానంలో, మన రూపంలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే పార్టనర్ కోసం మనల్ని మనం మార్చుకునే ప్రయత్నాలు మానేయాలి. అయితే అవి మనకి కూడా ఆనందాల్ని ఇస్తుంటే ఆ మార్పుని కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. 

• ప్రేమ మధురమే.. కానీ, అందులో అప్పుడప్పుడు చేదుని కూడా రుచి చూడాల్సిందే. అయితే ఆ చేదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రూపంలోనూ రావొచ్చు.
దానివల్లే చాలామంది వాళ్లని వాళ్లు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. “ఇలా నడుచుకోకపోతే పార్ట్నరికి నచ్చదేమో .. వదిలేస్తారేమో..” అన్న భయాలతో చాలామంది ఎదుటివాళ్ల ఇష్టాల్నే తమ ఇష్టాలుగా మార్చుకుంటుంటారు. కానీ, ఎదుటి వాళ్లని వాళ్ల లా యాక్సెప్ట్ చేయని వాళ్లు అవతలివాళ్ల లైఫ్ ఎప్పటికీ సంతోషాల్ని నింపలేరు. అందుకే రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందోనన్న భయంతో... పార్టనర్ ఆలోచనల్ని మన ఇష్టాలుగా చేసుకోవద్దు. 

* మనుషులు వేరు అయినప్పుడు వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు కూడా వేరుగానే ఉంటాయి. అందుకే నిర్ణయాల్ని గౌరవించేవాళ్లకే జీవితంలో చోటు ఇవ్వాలి. అలాగే ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నా.. ఇండిపెండెంట్ గా ఉండటం ముఖ్యం. అది ఎమోషనల్లీ కూడా. అలాగే ప్రతి చిన్న విషయానికి పార్టనర్ పై డిపెండ్ అవ్వకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ రిలేషన్లోనైనా ఎవరికివాళ్లు పర్సనల్ స్పేస్ ఉంచుకోవాలి. ఎవరిని వాళ్లు ప్రేమించుకోవాలి. వాళ్లలో వస్తున్న మార్పుల్ని గమనించుకోవాలి. అలాగే ప్రతి రిలేషన్కి కొన్ని బౌండరీలు పెట్టుకోవాలి.