- అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న రోడ్డును కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్‌రావు భూ కబ్జాకు పాల్పడుతున్నాడని పలువురు ఆరోపించారు. అడ్డుకున్న తమపై దాడి చేసేందుకు యత్నించాడని బాధితులు బుధవారం నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కవిత మామ పొతంగల్ రాంకిషన్‌రావుకు నగరంలోని బైపాస్ పక్కన కొంత ల్యాండ్ ఉంది.
ఆ భూమిని అటల్ డెవలపర్స్‌కు ఇచ్చి ఆర్‌కేఆర్ పేరుతో అపార్ట్‌మెంట్ కట్టించాడు. మొత్తం 30 ప్లాట్లు కట్టగా ఇద్దరూ షేర్ చేసుకొని విక్రయించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే మెయిన్ రోడ్ పక్కన ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు ఫ్లాట్ ఓనర్లు ఇన్నాళ్లూ ఉపయోగించిన రోడ్డును క్లోజ్ చేసేందుకు వారం కింద నలుగురు వ్యక్తులు కంకర, స్టీల్ తీసుకొని వచ్చారు.
గమనించిన ఫ్లాట్ ఓనర్లు అడ్డుకున్నారు. బుధవారం మరోసారి రావడంతో ఘర్షణపడ్డారు. అయితే రాంకిషన్‌రావే రోడ్డును కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అడ్డుకున్న తమపై దాడి చేశారని పలువురు ఫ్లాట్ ఓనర్లు ఆరోపించారు. ఈ మేరకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోడ్డును ఆక్రమించి షట్టర్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
రోడ్డును ఆక్రమించేందుకు యత్నిస్తున్న రాంకిషన్‌రావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్‌కు పక్కన ఉన్నది రోడ్డు కాదని, అది తన ప్లాట్ అని కోడూరు నగేశ్ కుమార్ అనే వ్యక్తి గురువారం మీడియాకు చెప్పారు. సర్వే నంబర్ 219లో ఉన్న 235 గజాల స్థలాన్ని 2018లో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నానని, ఈ ల్యాండ్‌కు రాంకిషన్‌రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయనను ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు.