బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో మత్స్య 6000

బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం తదితర సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి పరిశోధన చేసేందుకు డీప్​ ఓషన్​ మిషన్​ను మినిస్ట్రీ ఆఫ్​ ఎర్త్​ సైన్సెస్​ సముద్రయాన్​లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవ సహిత సబ్​మెర్సిబుల్​ వాహనాన్ని ప్రయోగించనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓషన్​ టెక్నాలజీలో వేగంగా జరుగుతున్నాయి. 

500 మీటర్ల లోతు వరకు మొదట మానవరహితంగా వెళ్లేలా వాహనాన్ని తయారు చేస్తున్నారు. మొదట మానవులు లేకుండా పంపి ఫలితాన్ని అనుసరించిన తర్వాత మనుషులతో 2025, సెప్టెంబర్​ నుంచి డిసెంబర్​ లోపు ట్రయల్స్​ పూర్తి చేసుకుని 2026 నుంచి పరిశోధనలు చేపట్టనున్నారు. 

ప్రధాన మంత్రి సైన్స్​, టెక్నాలజీ ఇన్నోవేషన్​ అడ్వైజరీ కౌన్సిల్​ ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిది మిషన్లలో డీప్​ ఓషన్​ మిషన్​ ఒకటి. సముద్రయాన్​లో భాగంగా 2021లో భూ శాస్త్రాల మంత్రిత్వశాఖ ప్రారంభించింది. 

పైలట్​, ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చునేందుకు వీలుగా 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార స్పియర్​ను తయారు చేశారు. ఇక్కడి నుంచే ఈ వాహనాన్ని శాస్త్రవేత్తలు నియంత్రిస్తారు. ఈ వాహనం అత్యాధునిక సాంకేతికత వ్యవస్థ సాయంతో స్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ వాహనం ఐదు టన్నుల బరువు ఉంటుంది. భారతదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు 6 వేల మీటర్ల నుంచి 7500 మీటర్ల లోతు వరకు వెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది. 

భూ ఉపరితలంతో పోల్చితే మహాసముద్రాల గర్భంలో 750 రెట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పైగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. అంతటి తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేకంగా తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు.