ఆర్థిక సంస్కరణల విప్లవకారుడు మన్మోహన్ సింగ్

డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం.. ఒక సామాన్య స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ఒక అద్భుత జీవన ప్రయాణం.  ఆర్థికవేత్తగా, దేశ ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు దార్శనికతకు నిదర్శనం. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయినప్పటికీ ఏమాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చదువుపై ఉన్న మక్కువతో  ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక మేధావిగా ఎదిగారు.  పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జ్,  ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు.  ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌లో అనేక పరిశోధనల ద్వారా ఒక దృఢమైన దృష్టిని ఏర్పరుచుకున్నారు. మన్మోహన్​ విద్యాభ్యాసం ముగిసిన తొలి రోజుల్లోనే దేశ తొలి ప్రధాని నెహ్రూ..  డాక్టర్ మన్మోహన్ సింగ్​ను ఆర్థిక సలహాదారుగా ఉండాలని కోరినప్పుడు  సున్నితంగా ఆ  ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రభుత్వంలో చేరడం కన్నా విద్యారంగంలో,  పరిశోధనలో ఎక్కువగా కృషి చేయడం ద్వారా సమాజానికి ఎంతో సేవ  చేయగలనని  నమ్మిన వ్యక్తి మన్మోహన్ సింగ్.

1972లో ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో ప్రణబ్​ముఖర్జీ 1982లో  ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు  మన్మోహన్ సింగ్​ను  ఆర్బీఐ  గవర్నర్​గా నియమించడం జరిగింది.  అంతేకాకుండా యూనివర్సిటీ  గ్రాంట్స్​ కమిషన్  చైర్మన్​గా, భారత ప్లానింగ్ కమిషన్ వైస్  చైర్మన్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించి  విద్యాభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో  విశిష్ట సేవలు అందించారు. 

1991–-96 మధ్య కాలంలో ఆర్థిక మంత్రి హోదాలో,  మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్పు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆకాంక్షలకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ ఆలోచనలు తోడై  దేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టారు.  అప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో విదేశీ మారక నిల్వలు కేవలం రూ.100 కోట్లు ఉండటం అవి కేవలం అంతర్జాతీయ మారకానికి సుమారు 15 రోజులకు సరిపడా మాత్రమే ఉన్న సంక్లిష్ట పరిస్థితి.  ఆ సమయంలో  ఆయన తీసుకున్న సంస్కరణలు  దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చాయి. 

విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం

 విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, భూ సంస్కరణలు, చంద్రయాన్, మంగళ్‌‌‌‌‌‌‌‌యాన్, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డుల జారీ వంటివి మన్మోహన్‌‌‌‌‌‌‌‌ హయాంలో రూపుదిద్దుకున్నవే.  ప్రయివేటీకరణకు కూడా  ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్య ‘ఒక మంచి ఆలోచనకు సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు’ దేశ ప్రజలకు ఎంతో  ప్రేరణ ఇచ్చింది. 

పేదల జీవితాల్లో అవి నేటికీ వెలుగులు నింపుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణే 100 రోజుల పనిదినాలు. అమెరికాతో అణు ఒప్పందాన్ని కూడా సింగ్‌‌‌‌‌‌‌‌ దూరదృష్టికి నిదర్శనం.  మన్మోహన్​ సింగ్‌‌‌‌‌‌‌‌ పాలనా కాలంలోనే 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్‌‌‌‌‌‌‌‌ సాంకేతిక విప్లవం ఊపందుకుంది.  ఆయన అందించిన సేవలు దేశ గౌరవాన్ని పెంచడంతోపాటు,  పేదల అభ్యున్నతికీ ఎంతగానో తోడ్పడ్డాయి.  విద్యారంగంలో పనిచేసిన కీలక వ్యక్తిగా, ఒక అధికారిగా,   ప్రధానమంత్రిగా పనిచేసిన సందర్భంలో సైతం ఆయన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. 

Also Read : మిగులు విద్యుత్ ​ఉత్పత్తి దిశగా తెలంగాణ.!

సాధారణ మనిషి.. అసాధారణ మార్పులు

సామాన్య ప్రజలపైన భారం పడకుండా జాగ్రత్తలు తీసుకొని అనేక కార్యక్రమాలను రూపొందించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్.  ప్రభుత్వ, అనుబంధ రంగాలలో జరుగుతున్న అన్ని రకాల వివరాలు ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనం తీసుకురావడం కోసం  రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి చట్టం కూడా తెచ్చి ఉద్యోగస్తులు, అధికారుల్లో బాధ్యతను మరింత పెంచారు.  పన్ను సంస్కరణలు చేపట్టి అప్పట్లో ఉన్న అమ్మకపు పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్నులు తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేడు పెద్ద ఎత్తున అమలవుతున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)  ఆలోచన చేసింది  కూడా మన్మోహన్ సింగ్.  రాజకీయాల్లో  విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన విధానాల మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. ‘సాధారణ మనిషి కూడా అసాధారణ మార్పులు .
తీసుకురాగలడు’ అనే దానికి ఆయన జీవితంప్రత్యక్ష సాక్ష్యం. సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన దేశాభివృద్ధిపై తన నిబద్ధతను నిలబెట్టుకున్నారు.  ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా ఆయన కృషి చేశారు.  

మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం

ప్రభుత్వం నేరుగా వ్యాపారాలలో జోక్యం చేసుకోవడం తగ్గించేవిధంగా మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించారు.  వాణిజ్యంతో పాటు, స్వచ్ఛందంగా అభివృద్ధి చెందే మార్కెట్లను ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడుల ద్వారా భారతదేశం ఆర్థిక వృద్ధిని సాధించడానికి కృషి చేశారు. పెట్టుబడులు తీసుకురావడం ద్వారా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని ఆయన విశ్వసించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక సంస్కరణలకు ఇచ్చిన చైతన్యంతో, ఎవరూ ఊహించనివిధంగా భారతదేశ ఆర్థిక శక్తిని పెంచారు.  మన్మోహన్ సింగ్​ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చాలా విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పటికీ వెనక్కి తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో విమర్శలకు గురయ్యారు. అయితే, ఆయన తన విధానాల మీద విశ్వాసాన్ని కోల్పోకుండా  వాటిని చిత్తశుద్ధితో నమ్మి ముందుకుసాగారు. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి,  ప్రపంచంలో ప్రసిద్ధమైన ఆర్థికవేత్తగా ఎదగడం, భారతదేశ ఆర్థిక విధానాలను మార్చడం ద్వారా మన్మోహన్​ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. 

 -చిట్టెడ్డి కృష్ణారెడ్డి,
అసోసియేట్ ప్రొఫెసర్,
హెచ్​సీయూ