మన్మోహన్​సింగ్​ మృతి దేశానికి తీరని లోటు

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి క్యాంపు కార్యాలయంతోపాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని కాంగ్రెస్​ కార్యాలయాల్లో మన్మోహన్​సింగ్​ ఫొటోకు పూలమాలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ ప్రధానిగా యూపీఏ హయాంలో పదేండ్లు మన్మోహన్​సింగ్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో​నిలిచారని చెప్పారు. 

పేదవాడి అభ్యున్నతి కోసం రూపొందిన విద్యా హక్కు, సమాచార హక్కు, ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. మన్మోహన్​సింగ్​మృతి దేశానికి తీరని లోటని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. - వెలుగు నెట్​వర్క్​