జగిత్యాల ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలు తారుమారు

జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దురు నవజాత శిశువులు తారుమారు అయ్యారు. ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు మగ శిశువుల్లో ఒక బాబుని సిబ్బంది మరో తల్లికి అప్పగించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశరు. బీర్పూర్ మండలం మంగేలా గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో ఎంసిహెచ్ లో చేరింది. ప్రసన్నతో పాటు మరో మహిళకు డాక్టర్లు ప్రసవం చేశారు. పుట్టిన పిల్లల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు సిబ్బంది. 

బేబీని తల్లిదండ్రులకు ఇచ్చే సమయంలో డ్రెస్, టవల్ మాది కాదని చెప్తున్నా.. మీ బేబీనే సిబ్బంది దబాయించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. శిశువులు తారుమారు అయిన మాట వాస్తవమేనని ఆర్ఎంఓ నవీన్ అన్నారు. కానీ.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తిరిగి ఎవరి బిడ్డను వారికి ఇచ్చారని అన్నారు. ఈ ఘటనను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లి.. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో హామీ ఇచ్చారు.