వచ్చే వారం నుంచి మండల స్థాయి ప్రజావాణి : కలెక్టర్  విజయేందిర బోయి

  • ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం
  •  పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి

మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చే సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరు కావాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని, హెల్ప్ డెస్క్  ఏర్పాటు చేయాలని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పరిష్కారం కానివి ఉంటే ఫిర్యాదుదారుడికి తెలియజేయాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని పంపించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఫిర్యాదులన్నీ మండల స్థాయిలోనే పరిష్కరించాలని తెలిపారు. మండల స్థాయిలో ఫిర్యాదు చేసిన 15 రోజుల తరువాత పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి రావాలని ఆమె ప్రజలను కోరారు. పరిష్కరించిన ఫిర్యాదులను ఆన్​లైన్​లో నమోదు చేయాలని, ప్రతి ఫిర్యాదుకు ఐడీ నంబర్  ఇవ్వాలని చెప్పారు. అడిషనల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో  నవీన్, జిల్లా అధికారులు హాజరయ్యారు.

Also Read : గట్టు లిఫ్ట్ ను అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించేందుకు కృషి

నాగర్ కర్నూల్ టౌన్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్​కర్నూల్​ కలెక్టర్‌‌‌‌‌‌‌‌  బదావత్  సంతోష్  హెచ్చరించారు. కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 167 మంది అర్జీలు అందజేసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తారని, వాటిని అధికారులకు వెంటనే పరిష్కరించాలని సూచించారు. డీఆర్డీవో చిన్న ఓబులేషు, కలెక్టరేట్  ఏవో చంద్రశేఖర్  పాల్గొన్నారు.

ఎస్పీ ఆఫీస్ లో 14 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్  ఎస్పీ ఆఫీస్ లో ప్రజావాణిలో భాగంగా 14 మంది ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్  వైభవ్ రఘునాథ్  తెలిపారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్​ అధికారులకు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

వనపర్తి: ప్రజావాణి అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్  సంచిత్  గంగ్వార్  ఆదేశించారు. ప్రజావాణి హాల్​లో స్సెషల్​ డిప్యూటీ కలెక్టర్  వెంకటేశ్వర్లు, డీఆర్డీవో ఉమాదేవితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.  అనంతరం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా డీఆర్డీవో ద్వారా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ, సెల్ఫీ స్టాండ్​ను ప్రారంభించారు.

నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్  గరిమ నరుల సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆమెకు వివరించి అర్జీలు అందించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.