కరీంనగర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు.. కార్లు, బైకులను ఢీకొట్టాడు..

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు.. అది కూడా బస్సు డ్రైవ్ చేస్తు్న్న సమయంలో వచ్చింది.. తీవ్ర గుండెపోటు కావటంతో.. బస్సును కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన ఉన్న కార్లు, బైకులపైకి దూసుకెళ్లింది ఆ బస్సు.. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళుతుంది. బస్సు డ్రైవర్ ఎల్లయ్య. 2024, డిసెంబర్ 20వ తేదీ ఉదయం.. మంచిర్యాలలో బస్సు బయలుదేరే సమయంలో ఆరోగ్యంగానే ఉన్న ఎల్లయ్య.. మంచిర్యాల ఐబీ చౌరస్తా దగ్గరకు రాగానే.. గుండెపోటుకు గురయ్యాడు. బస్సును ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా.. వీలుకాకపోవటంతో అదుపు తప్పింది. దీంతో రోడ్డుపై.. బస్సు ముందు వెళుతున్న కార్లు, బైకులను ఢీకొట్టింది బస్సు. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా.. ఓ బైక్ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

ముందు వెళుతున్న వాహనాలను ఢీకొట్టిన తర్వాత ఆగిన ఆర్టీసీ బస్సు నుంచి.. డ్రైవర్ ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించారు ప్రయాణికులు. తీవ్ర గుండెపోటు వచ్చినా.. బస్సును కంట్రోల్ చేయటంతో ఘోర ప్రమాదం తప్పిందని.. లేకపోతే బస్సులోని ప్రయాణికులు అందరూ ప్రమాదంలో పడేవారని చెబుతున్నారు కండెక్టర్.