బస్తాకు 41 కిలోలే జోకాలే.. కటింగ్ ​పెడితే చర్యలు

  • వెలుగు ఇంటర్వ్యూలో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతీలాల్
  • పకడ్బందీగా కొనుగోళ్లు
  • ఈ సీజన్​లో లక్షన్నర మెట్రిక్ టన్నులు టార్గెట్ 
  • జిల్లావ్యాప్తంగా 326 సెంటర్లు ఏర్పాటు 
  • 48 గంటల్లో రైతుల అకౌంట్లలో పైసలు జమ చేస్తాం
  • డీఫాల్ట్ మిల్లులకు ఈసారి వడ్లు ఇయ్యం

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపేందుకు చర్యలు చేపట్టామని మంచిర్యాల అడిషనల్​ కలెక్టర్ (రెవెన్యూ) సబావత్​ మోతీలాల్ ​తెలిపారు. వానాకాలం సీజన్​లో లక్షన్నర మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్​గా పెట్టుకున్నామని, ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు షురూ అయ్యాయని, వారం పది రోజుల్లో సెంటర్లకు ధాన్యం వస్తుందని, అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉన్నామని వెల్లడించారు. ఆయన ‘వెలుగు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలివీ... 

లక్షన్నర టన్నులు.. 326 సెంటర్లు 

మంచిర్యాల జిల్లాలో వానాకాలం సీజన్​లో 3.30 లక్షల ధాన్యం దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో 65 శాతానికి పైగా సన్నాలే పండించారు. సన్నాలకు క్వింటాల్​కు ప్రభుత్వం రూ.500 బోనస్​ ప్రకటించింది. ఎమ్మెస్పీ, బోనస్ కలిపితే రైతులకు రూ.2,800 వస్తుంది. ఇప్పటికే మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలు రూ.3వేలకు కొంటున్నారు. ఇలా రైతులు బయట అమ్ముకోవడంతో పాటు తిండి కోసం కొంత దాచుకుంటారు. ఇది పోగా కొనుగోలు కేంద్రాలకు లక్షన్నర మెట్రిక్​ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 326 సెంటర్లు ఏర్పాటు చేసి, ఇప్పటికే 296 ఓపెన్​ చేశాం. 

అంతా మెషీన్ల ద్వారానే..

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. అన్ని సెంటర్లకు టార్పాలిన్లు సప్లయ్ చేశాం. మార్కెటింగ్​ శాఖ ద్వారా మరో 2వేలు కొనుగోలు చేస్తున్నాం. 355 ఎలక్ట్రానిక్​ కాంటాలు, రెండు సెంటర్లకు ఒకటి చొప్పున ప్యాడీ క్లీనింగ్​ మెషీన్లు, 40 గ్రెయిన్ డ్రయ్యర్ ​మెషీన్లు అందుబాటులో ఉంచాం. ప్రభుత్వం 33 రకాల వడ్లను సన్నాలుగా ప్రకటించింది. వాటిని గుర్తించేందుకు హస్కి రిమూవర్(డీహస్కర్), బియ్యం సైజ్​ తెలుసుకునేందుకు డయల్​ మైక్రోమీటర్​(గ్రెయిన్​ క్యాలిపర్) మెషీన్లు, ట్యాబ్​లు అన్ని సెంటర్లకు సప్లయ్ చేశాం. జిల్లాకు 80 లక్షల గన్నీబ్యాగులు అవసరమైతే 33 లక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు లక్ష కొత్త బ్యాగులు వస్తున్నాయి. బ్యాగుల కొరత కూడా ఉండదు.

ఐరిస్​లేదా ఓటీపీ ద్వారా..

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈసారి ఐరిస్​ సిస్టం ​ప్రవేశపెట్టాం. ఒకవేళ ఐరిస్​నమోదు కాకుంటే రైతు మొబైల్ ​నంబర్​కు ఓటీపీ వస్తుంది. ఏఈవో ద్వారా టోకెన్​ తీసుకొని వారికి కేటాయించిన రోజునే ధాన్యం తీసుకురావాలి. మాయిశ్చర్​14 నుంచి 17 పర్సెంట్​ మించకూడదు. పట్టాదారు పాస్​బుక్, ఆధార్​కార్డు, బ్యాంక్​ అకౌంట్​తప్పనిసరిగా అందజేయాలి. హమాలీ చార్జీలను రైతులే భరించాలి. 48 గంటల్లోగా బ్యాంక్ ​అకౌంట్లలో పైసలు పడుతాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులకు అవేర్​నెస్​ క్యాంపులు నిర్వహించాం. పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా బోర్డర్​లో చెక్​పోస్టులు ఏర్పాటు చేశాం. ట్రాన్స్ పోర్టేషన్​ సమస్యలు రాకుండా జిల్లాను నాలుగు సెక్టార్లుగా విభజించి టెండర్లు నిర్వహించాం. 

డీఫాల్ట్ లిస్టులో 39 మిల్లులు

జిల్లాలో సీఎమ్మార్​ పెండింగ్​ఉన్న 39 మిల్లులను డీఫాల్ట్​ లిస్టులో చేర్చాం. ఈసారి ఆ మిల్లులకు వడ్లు ఇవ్వడం లేదు. మిగతా 28 మిల్లులకు బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని ధాన్యం కేటాయిస్తాం. వీటి కెపాసిటీ 1.10 లక్షల మెట్రిక్ ​టన్నులు. జిల్లాలో 20 వేల మెట్రిక్​ టన్నుల కెపాసిటీ గల ఇంటర్మీడియేట్​గోడౌన్లను సిద్ధం చేశాం. మిగతా వడ్లను కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు పంపుతాం. 

16 మిల్లులపై ఆర్​ఆర్​ యాక్ట్

జిల్లాలో సీఎమ్మార్​ఎగ్గొట్టిన 16 రైస్​మిల్లులపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) యాక్ట్​ నోటీసులు జారీ చేశాం. 5 మిల్లులపై ఎఫ్ఐఆర్​ నమోదు చేయించాం. ఇప్పటికే ఇద్దరు మిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరో ఇద్దరు మిల్లర్లు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. సీఎమ్మార్ ​డెలివరీకి ఈ నెలాఖరు వరకు గడువుంది. ఈలోగా క్లియర్​చేయని వాళ్లపై యాక్షన్​ తీసుకుంటాం.