పరిచయం : అమ్మ అయ్యాకే బోలెడు అవకాశాలు

హీరోయిన్లు కొంతకాలమే లైమ్​ లైట్​లో ఉంటారు. పెండ్లి అయితే చాలామంది ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. మరికొందరికి నటించాలనే ఆశ ఉన్నా అవకాశాలు అంతగా రావు. ఒకవేళ వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్​ అవకాశాలు వస్తాయి. కొందరు వాటిని వదులుకుంటే ... మరికొందరు అవకాశాన్ని వదులుకోరు. కానీ మానసి పరేఖ్​కి  మాత్రం అమ్మ అయ్యాకే అవకాశాలు పెరిగాయి. 

తను ప్రొడ్యూస్​ చేసిన ప్రతి సినిమాలో నటించింది. ఆ సినిమాలన్నీ సూపర్​ సక్సెస్ అయ్యాయి! అంతకంటే గొప్ప విషయం ఏంటంటే.. ఇప్పుడు ఆమె నటించి, ప్రొడ్యూస్ చేసిన సినిమాకు, అందులో ఆమె పాత్రకు జాతీయ అవార్డు దక్కడం. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆమె జర్నీ..

‘‘నేను పుట్టింది గుజరాత్ రాష్ట్రంలో​. కానీ పెరిగింది మాత్రం ముంబైలో. గుజరాతీ కల్చర్, ట్రెడిషన్, అక్కడి ఫేమస్​ ప్లేస్​లు అంటే చాలా ఇష్టం. అలా నాకు గుజరాత్, ముంబైతో అనుబంధం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి సంగీతమంటే చాలా ఇష్టం ఉండేది. అందుకని సంగీతం నేర్చుకున్నా. ‘ఇండియా కాలింగ్’ అనే సింగింగ్ రియాలిటీ షోతో పాపులారిటీ వచ్చింది. దాంతో గుజరాతీ సినిమాల్లో పాటలు పాడా. ఫోక్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్​ కూడా చేశా. జీ టీవీ ‘స్టార్ యా రాక్​స్టార్​’ షోలో విన్నర్ అయ్యా. నాకు సింగర్​గా ఫేమ్ రావడంతో నటిగా కూడా ప్రూవ్ చేసుకునేందుకు యాడ్స్, సీరియల్ అవకాశాలు వచ్చాయి. ఒక షోకి వెళ్తే మరో షోలో అవకాశం వచ్చేది. 

హీరోయిన్ అవ్వాలని..

న్యూయార్క్​లోని ‘లీ స్ట్రాస్ బర్గ్​ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్​’లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నా. 2003లో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశా. అలా మొదట టీవీ ప్రేక్షకుల​కు కనెక్ట్ అయ్యా. కొంతమంది అనుకోకుండా యాక్టర్​ అయ్యా అని చెప్తుంటారు. కానీ, నేను మాత్రం హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. కాకపోతే ఆ అవకాశం అంత ఈజీగా రాలేదు. ‘కిత్​నీ మస్త్​ హై జిందగీ’ సీరియల్​లో సపోర్టింగ్​ రోల్​తో నటిగా కెరీర్​ మొదలైంది. ​అలా 2004లో సీరియల్​లో నటించడం  మొదలుపెడితే.. అది2015 వరకు కంటిన్యూ అయింది. 

అయితే ఒకవైపు సీరియల్స్​తో బిజీగా ఉన్నా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. 2012లో రిలీజ్​ అయిన ‘లీలై’ అనే తమిళ సినిమాతో హీరోయిన్​ అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది.. నాకు పేరొచ్చింది. కానీ, రెండో అవకాశం మాత్రం అంత త్వరగా రాలేదు. దాదాపు ఏడేండ్ల తర్వాత 2019లో బాలీవుడ్ సినిమా ‘ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్’లో నటించే ఛాన్స్​ వచ్చింది.  అంతేకాదు.. సినిమాలు, సీరియల్స్​తోపాటు వెబ్​ సిరీస్​ల్లో కూడా నటిస్తున్నా. ఇప్పటికే ‘ది రైట్ టైం’, ‘ట్రూత్ ఆర్ డేర్’, ‘డు నాట్ డిస్టర్బ్’ వంటి వెబ్​ సిరీస్​లు చేశా. 2019లో ‘లడ్డూ’ అనే షార్ట్​ ఫిల్మ్​లో కూడా నటించా. 

ప్రొడ్యూసర్​గా సూపర్ హిట్స్

2020 నుంచి ఇప్పటివరకు వరుసగా గుజరాతీ సినిమాల్లో నటిస్తూ వస్తున్నా. అందులో నా హోం ప్రొడక్షన్ ‘తుమ్​ భి నా’ ​లోనే మూడు సినిమాలు తీశా.  ఫస్ట్ మూవీ ‘గోల్​కేరీ’. ఆ తర్వాత 2023లో ‘కచ్ ఎక్స్​ప్రెస్​’, 2024లో ‘ఝంకుడి’.  ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యే వచ్చిన ‘ఝంకుడి’ సినిమాలో నాది లీడ్ రోల్.  నేను సింగర్​ని కూడా కాబట్టి నన్ను ఒక పాట పాడమన్నారు. ఆ పాట వైరల్ కావడం సంతోషాన్నిచ్చింది. గుజరాతీ సినిమాల్లోనే ఈ ఏడాది బెస్ట్ పాట​గా కూడా నిలిచింది. 2022లో నేను నటించి, ప్రొడ్యూస్ చేసిన ‘కచ్ ఎక్స్‌‌‌‌ప్రెస్’ సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ వచ్చింది.

టీవీతో 20 ఏండ్ల అనుబంధం 

టీవీ ఇండస్ట్రీతో 20 ఏండ్ల అనుబంధం ఉంది. టీవీలో పనిచేసేవాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని పూర్తి చేయాల్సిందే. వ్యక్తిగత విషయాలు, ఎమోషన్స్ అన్నీ పక్కనపెట్టి నటన మీదే ఫోకస్ చేయాలి. అది నాకు మిలిటరీ ట్రైనింగ్​లా అనిపించేది. ప్రతి రోజూ షూటింగ్​కి వెళ్లాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, ముఖ్యమైన పనులున్నా సరే. ఎలాంటి సిచ్యుయేషన్​లో అయినా స్టేబుల్​గా ఉండడం అప్పుడే నేర్చుకున్నా. ‘గులాల్​’ అనే షో చేయడానికి డైలీ రానుపోను మూడు గంటల జర్నీ చేయాల్సి వచ్చింది. సెట్​లోనే14 గంటలు ఉండాల్సి వచ్చేది. అంటే17 గంటలు నిరంతరాయంగా కష్టపడ్డా. నిద్రకు టైం సరిపోయేది కాదు. అలా ఒక ఏడాది చేశా. ఆరునెలలు అయ్యేసరికే నా హెల్త్ పాడయింది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. అలా ఉంటే నా ప్రొఫెషన్​కి సరిపోదు. ఇలానే ఎన్నో క్లిష్ట పరిస్థితులని, సవాళ్లను ఎదుర్కొన్ని ఇక్కడికి చేరుకున్నా. 

అమ్మ అయ్యాకే బిజీ!

తోటి సింగర్ పార్థివ్ గోహిల్​ను పెండ్లి చేసుకున్నా. మాకో పాప. పేరు నిర్వి. పనిని, పర్సనల్ లైఫ్​ని బ్యాలెన్స్ చేయడం కష్టం అనుకునేదాన్ని. కానీ, ఇప్పుడు నా కూతురు అన్నీ అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉంది. కాబట్టి నేను నా వర్క్స్​కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, కూతుర్ని కూడా అంతే బాగా చూసుకుంటా. నేను సినిమాల్లోకి వచ్చి దాదాపు ఎనిమిదేండ్లు అవుతోంది. నా కూతురు పుట్టాకే ఏడు సినిమాల్లో నటించా. నా కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే మిగతావాళ్లకు మల్లే వయసులో ఉన్నప్పుడు నాకు అవకాశాలు రాలేదు. తల్లినయ్యాకే.. అవకాశాలు పెరిగాయి. అందుకే 38 ఏండ్ల వయసులోనూ బిజీగా ఉంది నా షెడ్యూల్. పెండ్లి చేసుకోవడం, అమ్మను కావడం.. నా కెరీర్​కు మరింత హెల్ప్ అయ్యాయి అనిపిస్తుంది. 

అది నా అదృష్టం 

నిజానికి నేను ఆ సినిమాలో నటించాలని అనుకోలేదు. నా టీం మెంబర్స్ కూడా నన్ను నటించమని అడిగారు. కానీ, నేను ఆ సినిమాకి ప్రొడ్యూసర్​గా ఉండడంతో నటించలేనని చెప్పా. అందుకు కారణం.. ఆ క్యారెక్టర్​లో చాలా షేడ్స్ ఉంటాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అయితే, నా టీం అంతగా అడుగుతుండడంతో ‘ఆడిషన్ ఇస్తా’ అని చెప్పా. ఆడిషన్​ పూర్తయ్యాక, లుక్ టెస్ట్​ చేశారు. అవన్నీ పూర్తి చేశాక అందరూ ఆ పాత్ర నన్నే చేయమని అడిగారు. అలా ఆ సినిమాలో నటించా. నిజానికి ఆ సినిమా చేయడం నా అదృష్టం అని అప్పుడే అనుకున్నా.

ఇదీ కథ

ఓ మధ్య తరగతి మహిళ.  సంప్రదాయాలను పాటించే ఇల్లాలు. అలాంటి ఆమెకు ఒక కష్టం వచ్చింది.  ఆమె భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ భర్తను తిరిగి తనవైపు తిప్పుకోవాలని, సరైన మార్గంలో నడిపించాలని తను శాయశక్తులా ప్రయత్నించే భార్యగా నటించింది మానసి. ఆ సినిమాలో ఆమె నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.  

అవార్డ్​ సర్​ప్రైజ్ చేసింది

 షూటింగ్​లో ఉండగా ‘ఉత్తమనటిగా జాతీయ అవార్డు గెలిచినందుకు శుభాకాంక్షలు’ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా మెసేజ్​లు వస్తూనే ఉన్నాయి. దాంతో నా ఆనందం హద్దులు దాటింది. రెండు గంటలపాటు కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. నా కూతురు నిర్వి పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో.. ఇప్పుడు కూడా అలానే ఉంది నాకు. నాకే కాదు.. ‘కచ్ ఎక్స్​ప్రెస్’ సినిమా సామాజిక సమస్యను చూపించే విభాగంలో ఉత్తమ చిత్రంగా.. ఉత్తమ స్టయిలిస్ట్​ విభాగంలో నిక్కి జోషికి కూడా అవార్డులు వచ్చాయి. ఇది మరపురాని క్షణం.

ఏకంగా వ్యాసాలు! 

మామూలుగా ఒక సినిమా రిలీజ్ కాగానే మెచ్చుకుంటూ మెసేజ్​లు వస్తుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. చాలామంది నాకు పెద్ద పెద్ద మెసేజ్​లు, వ్యాసాలు రాసి పంపారు. ఒకామె అయితే ‘‘ఇది నా రియల్ లైఫ్​ స్టోరీ. సినిమా చూస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేనేం ఫీలవుతున్నానో మీకు ఎలా తెలిసింది?” ఆ సినిమా ఇద్దరు మహిళలు చేసిన పోరాటాన్ని ఉద్దేశిస్తూ మెసేజ్ చేసింది. మరో మహిళ అయితే..150 మంది అత్తలు, కోడళ్లు కలిసి ఈ సినిమాకు వెళ్లడంతో ఆడిటోరియం నిండిపోయిందని నాతో చెప్పింది.’’